ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని దుస్థితా.? కారణం ఏదైతేనేం, ఎక్కడికి వెళ్ళినా అదే మాట పదే పదే చెబుతుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తాజాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అకాల వర్షాలకు పంట నష్టం సంభవించడంతో, రైతుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా, ‘ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తాను ఈ ప్రయత్నం చేశాను’ అని చెప్పుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్, తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే, ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెరుగుతుంది.?
పైగా, వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించడానికే చాలా చాలా మొహమాటపడుతుంటారు.. చాలా చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా అరుదుగానే వైఎస్ జగన్, పులివెందులలో పర్యటిస్తుండడం తెలిసిన విషయాలే. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల కంటే, సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కంటే.. పొరుగు రాష్ట్రం కర్నాటకలోని బెంగళూరులోనే ఎక్కువ రోజులు వుంటున్న సంగతి తెలిసిందే.
ఆ విషయం పక్కన పెడితే, రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో, తన స్వార్జితం నుంచి పది వేలో.. పాతిక వేలో అయినా ఆర్థిక సాయం ప్రకటించి వుంటే బావుండేది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలానే సాయం చేస్తుంటారు మరి.!
ఇక, రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో, ‘మూడేళ్ళు కళ్ళు మూసుకోండి.. మన ప్రభుత్వం వస్తుంది.. మన ప్రభుత్వం వచ్చాక.. ఆదుకుంటాం..’ అని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
‘కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది’ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఈ కళ్ళు మూసుకోవడం కాన్సెప్ట్‌ని, వైసీపీ కార్యకర్తల ముందరా.. ఇతరత్రా కార్యక్రమాల్లో చాలాసార్లు వైఎస్ జగన్ వాడేశారు.
అయినా, రాజకీయాల్లో కళ్ళు మూసుకోవడమేంటి.? ఏమో, అది జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే తెలిసిన వ్యవహారం. అందరికీ అలా కుదరదు కదా.! రైతులు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే, వాళ్ళ బతుకులు బుగ్గిపాలైపోతాయ్.!