ప్రెస్ మీట్ అంటే ఏంటి.? జర్నలిస్టులు వుంటారు.. ప్రశ్నలు అడుగుతారు. వాటికి ప్రెస్ మీట్ పెట్టిన నాయకుడు సమాధానం చెప్పాలి.! ఏ అంశం మీదన ప్రెస్ మీట్ పెడుతున్నదీ, ముందే చెప్పాలి. అప్పటికి, ప్రస్తావనకు వచ్చిన అంశాలు, ఇతరత్రా విషయాలపై మీడియా, ఆయా రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తుంటుంది. ప్రెస్ మీట్ అంటే ఇదే.!
కానీ, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించే ప్రెస్ మీట్లు చిత్రంగా వుంటాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్ మీట్ కోసం ఏర్పాట్లు. కొన్ని పేపర్లు చేత్తో పట్టుకుని కూర్చునే వైఎస్ జగన్. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.. కాదు, చదివేస్తారు.
ఇంతకీ, జర్నలిస్టుల పనేంటి.? కూర్చుని, విని వెళ్ళిపోవాలి. ఎంపిక చేసిన పాత్రికేయులు మాత్రమే వెళతారు. తమ వెంట కెమెరాలు తీసుకెళ్ళడానికి వారికి అనుమతి వుండదు. ఆ తర్వాత సంబంధిత వీడియో విడుదల చేస్తారు. ఇదీ తంతు.!
కలియుగ ప్రతక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందన్నది ఆరోపణ. అందులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని వాడి, కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాల్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి.
కానీ, చంద్రబాబు వంద రోజుల పాలన గురించి మాట్లాడారు వైఎస్ జగన్, ప్రెస్ మీట్ పెట్టి. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ‘సూపర్ స్వామి’గా అభివర్ణించారాయన. ఇదా పద్ధతి.? అదే వైవీ సుబ్బారెడ్డి సతీమణి, ఓ సందర్భంలో ‘జగన్ రెడ్డి రక్షక గోవిందా’ అంటూ గోవింద నామాల్ని మార్చి చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలిక్కడ.
వైసీపీ హయాంలో, అంతర్వేది రధం తగలబడింది.. అదే వైసీపీ హయాంలో, రామతీర్థం కొండపై రాములోరి విగ్రహం తల నరికారు దుండగులు. వైసీపీ హయాంలో చాలా దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ‘విరిగింది ఆంజనేయస్వామి బొమ్మ తాలూకు చెయ్యే కదా.?’ అంటూ తేలిగ్గా మాట్లాడారు అప్పట్లో ఓ వైసీపీ మంత్రి.
చెప్పుకుంటూ పోతే, విషయం చాలా పెద్దది. చాలా చాలా పెద్దది.! హిందూ మత విశ్వాసాల్ని దెబ్బ తీస్తూ, వినాయక చవితి సమయంలో విగ్రహాలకు వైసీపీ రంగులు పూసిన సందర్భాలున్నాయి. దేవాలయాల ముందర ఆ దేవాలయాలు కనిపించకుండా, వైసీపీ జెండాలు కట్టిన దాఖలాలు చాలానే. ఇంత వైపరీత్యం వైసీపీ హయాంలో జరిగింది.
వీటన్నిటినీ అడ్రస్ చేయకుండా, ప్రాక్టీస్ చేసుకొచ్చిన మాటల్ని చదివేసి, ప్రెస్ మీట్ అయిపోయిందనిపించేశారు వైఎస్ జగన్. ఇదేం ప్రెస్ మీట్.? దేశవ్యాప్తంగా హిందువులు వైసీపీని తప్పు పడుతున్నారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మల్ని తగలబెడుతున్నారు. తప్పించుకు తిరిగితే సరిపోదు.. యావత్ హిందూ సమాజం, తిరుపతి లడ్డూ విషయమై జగన్ నుంచి సమాధానాన్ని, క్షమాపణనీ డిమాండ్ చేస్తోంది.