దేశ రాజకీయ చరిత్రలో ‘బటన్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరే.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అప్పులు చేయడం, ఆ వెంటనే బటన్లు నొక్కడం.. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసింది.
బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రే ఎందుకు.? అన్న ప్రశ్నకి వైసీపీ శ్రేణుల దగ్గర ఇప్పటికీ సమాధానం వుండదు. ఈ బటన్లు నొక్కే కార్యక్రమాల పేరుతో, రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకే పరిమితమయ్యేవారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ, ఇన్ని బటన్లు నొక్కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిందేంటి.? 151 నుంచి 11కి పడిపోవడం.!
జగన్ ‘అద్భుత’ పాలన తర్వాత, రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు మిగిలింది. పది లక్షల కోట్ల రూపాయల అప్పుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసేసి, రాష్ట్రం నెత్తిన పెను భారం మోపారన్న విమర్శలు టీడీపీ నుంచి, జనసేన అలాగే బీజేపీ నుంచీ అప్పట్లోనే వచ్చాయి. ఆ లెక్కలు ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.
అన్ని లక్షల కోట్లు అప్పు చేసి, బటన్లు నొక్కి.. ఆపై బకాయిలు కూడా మిగిల్చేశారు వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నిటికీ వందల కోట్లు, వేల కోట్లలో బకాయిలున్నాయ్.. జగన్ ప్రభుత్వం కుప్ప కూలేసరికి.
కూటమి ప్రభుత్వానికి ఇదే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అప్పులకుగాను, కట్టాల్సిన వడ్డీలే సుమారు 70 వేల కోట్ల రూపాయల దాకా వుంటోందంటే, చిన్న విషయం కాదు కదా.! రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచాం.. అని బటన్ నొక్కుడు వ్యవహారం గురించి చెప్పుకున్నారు జగన్. కానీ, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడలేదని గణాంకాలు చెబుతున్నాయ్.
చిత్రమేంటంటే, సాక్షికి ఇచ్చుకున్న ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి బకాయిల్లేవ్. వైసీపీ హయాంలో కుప్పలు తెప్పలుగా నియమించుకున్న సలహాదారులకు కూడా బకాయిల్లేవ్. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బకాయిలు మాత్రం పెద్దయెత్తున పోగుపడి వున్నాయ్.
ఇవే కాదు, వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి, ఇతర కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకుండా ఆపేయడంతో, ఆ బకాయిలూ రాష్ట్ర ఖజానాకి భారంగా మాారాయి. మొత్తంగా చూస్తే, లక్షా నలభై వేల కోట్ల రూపాయల బకాయిల్ని జగన్ సర్కారు మిగిల్చిపోయినట్లు తెలుస్తోంది.
జగనన్న షిక్కీలు, కోడిగుడ్లకు సంబంధించి కూడా దాదాపు 250 కోట్ల రూపాయల బకాయిలున్నాయంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకంగా 2200 కోట్లు కాగా, ఉద్యోగులకు 22 వేల కోట్ల బకాయిల్ని పెట్టింది అప్పటి జగన్ సర్కార్. ఉపాధి హామీ బకాయిలు, ఇరిగేషన్ శాఖ బకాయిలు.. ఇవన్నీ వేల కోట్ల వ్యవహారాలే.
తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయం కోసం, విశాఖలో జగన్ కోసం నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్ భవనాల కోసం.. చెప్పుకుంటూ పోతే, వృధా ఖర్చు అంచనాలకు అందని రీతిలో వుంది. ఇలాంటి అర్థం పర్థం లేని వ్యవహారాల కోసం కీలకమైన నిధుల్ని వృధా చేసి, ముఖ్యమైన కార్యక్రమాలకు చెల్లింపులు చేయకుండా, బకాయిలు మిగిల్చిన జగన్, రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు.. అంచనాలకు అందనిది.
70 వేల కోట్లకు పైగా వడ్డీలకే చెల్లిస్తూ కూడా, అధికారంలోకి వస్తూనే సామాజిక పెన్షన్లు పెంచడం సహా, ఎన్నికల హామీలన్నిటినీ నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది కూటమి సర్కార్. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకు రానుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం.