మాతృ భాషను మృత భాషగా మార్చేసి, పరాయి భాషే మన భాషగా జనం నెత్తిన బలవంతంగా రుద్దితే, దాన్నేమనాలి.? ఈ చర్చ ఇప్పుడు కాదు, చాలాకాలంగా జరుగుతోంది. తమ పిల్లలు ఇంగ్లీషు ష్కూళ్ళకే వెళ్ళాలని రిక్షా కార్మికుడు సైతం అనుకోవడాన్ని తప్పు పట్టలేం. ‘నాలాగా రిక్షా తొక్కుకునే బతుకు ఎందుకు.? చదువుకుంటే, మంచి ఉద్యోగమొస్తుంది.. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది’ అని రిక్షా కార్మికుడు, సగటు కూలీ.. అనుకోవడం ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితమే మొదలైంది.
చదువుకోవడం వేరు, కేవలం ఇంగ్లీషులోనే చదువుకోవాలనడం వేరు.! ఇంగ్లీషు మీడియం సంగతి సరే, మాతృభాష మాటేమిటి.? అని అడిగితే, ‘అదిగో, పేద విద్యార్థులు.. అందునా బీసీ, మైనార్టీ, దళిత విద్యార్థులు ఇంగ్లీషు విద్య చదువుకోకూడదని అంటున్నారు..’ అంటూ ఎదురుదాడి చేయడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది.
పాలకులు ఏం చెబితే, దానికి విద్యార్థుల తల్లిదండ్రులు గుడ్డిగా తల ఊపాలి.. పాలకులు ఏం చెబితే అదే మీడియా చూపించాలి.. పాలకులు ఏం మాట్లాడితే దానికి విపక్షాలు వంత పాడాలి.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తంతు.
తెలుగు మీడియంలో చదువుకుని, ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించుకున్నవారెంతమంది లేరు.? మాధ్యమం వేరు, భాష వేరు, సబ్జెక్ట్ వేరు. ఈ మూడిటీకీ మధ్య వున్న తేడా ఎవరూ గమనించకూడదన్నది బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఉద్దేశ్యమేమో.! కొందరు విద్యార్థుల్ని తీసుకొచ్చి, వారితో ఇంగ్లీషులో మాట్లాడించేసి ముఖ్యమంత్రి మురిసిపోతే.. దాన్ని చూసి రాష్ట్రమంతా మురిసిపోవాలి.. రాష్ట్రంలో విద్యార్థులంతా అలాగే వున్నారని అనుకోవాలి.
రాష్ట్రంలో క్రిస్టియానిటీ పట్ల చెలరేగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. బలవంతపు మత మార్పిడులు, ఈ క్రమంలో తెలుగు భాషని అటకెక్కించేసి.. తెలుగు భాష ఉనికినే నాశనం చేసేలా కొన్ని క్రిస్టియన్ మిషనరీలు పనిచేస్తున్న తీరుపై చాలాకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ మత మార్పిడుల ప్రభావం కూడా, ఈ సరికొత్త భాషా ప్రావీణ్యం మీద వుందన్నది ఓ వాదన.
సరే, అన్నిటినీ కలగాపులగం చేసెయ్యలేం. ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చేశారు.. ఇంగ్లీషులో రాణించేస్తున్నారు.. సరే, వాళ్ళకి ఉద్యోగాలేవి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. అన్నట్టు, క్రికెట్ కామెంటరీ ఓ కుర్రాడు ముఖ్యమంత్రి ముందు అదరగొట్టేశాడట. ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాల్సింది.. క్రికెట్ కామెంటరీనే కాదు, కబడ్డీ కామెంటరీకి కూడా ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా వున్నాయి. ఇంగ్లీషుతో పోల్చితే, ప్రాంతీయ భాష్లలోనే అవకాశాలెక్కువ.