ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. అని రాజకీయ పరిభాషలో వాడుతుంటారు.. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. కనీ వినీ ఎరుగని విజయమిది. ముఖ్యమంత్రి అవ్వాలన్న వైఎస్ జగన్ కోరిక నెరవేరింది.
‘నేను అధికారంలోకి వస్తే..’ అంటూ అంతకు ముందు కుప్పలు తెప్పలుగా ఎన్నికల హామీలు ఇచ్చేశారు. నవరత్నాలన్నారు.. ఇంకేదేదో చెప్పేశారు. కేంద్రం సహకరించినా సహకరించకున్నా రాష్ట్రాన్ని ఉద్ధరించేందుకు తమ వద్ద అత్యద్భుతమైన ప్రణాళిక వుందన్నారు. అందుకే, అవన్నీ నమ్మారు జనం. నమ్మి ఓట్లేశారు వైఎస్సార్సీపీకి.
సరే, కరెన్సీ నోట్ల ప్రవాహం 2019 ఎన్నికల సమయంలో ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని సైతం కొనేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం వైఎస్సార్సీపీకి మాత్రమే దక్కుతుందనుకోండి.. అది వేరే సంగతి.
తన ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లే, తెలుగుదేశం పార్టీ కొంప ముంచేశాయి. అదే వైఎస్సార్సీపీకి అదనపు బలాన్నిచ్చాయి. ఈ రెండు పార్టీలూ కలిసి, జనసేన పార్టీని విజయవంతంగ తొక్కేయగలిగాయి కూడా.
గతం గతః మూడేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? ఏ ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో వున్నప్పుడు ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష.. అంటూ హడావిడి చేశారో, అలాంటిది ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయలేకపోయారు.
‘ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుంది..’ అని గతంలో చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ‘అడుగుతూనే వుంటాం..’ అని మాత్రం చెబుతున్నారాయన. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇలా పాత పాటే మళ్ళీ మళ్లీ పాడాలి.
ఇంతకీ, రాజధాని ఏమయ్యింది.? అది మాత్రం అస్సలు అడక్కూడదు. మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తామంటిరే.? అని ప్రశ్నిస్తే, దానికీ అధికార పార్టీ వద్ద సమాధానం వుండదు. మాట తప్పేది లే.. మడమ తిప్పేదిలే.. అది ప్రతిపక్షంలో వున్నప్పటి మాట. సీపీఎస్ రద్దు సహా అనేక అంశాల్లో మాట తప్పుడు, మడమ తిప్పుడే.!
ఇదీ మూడేళ్ళ వైసీపీ సర్కారు ఘనత.! మరి, రాష్ట్రానికి ఒరిగిందేంటి.? అప్పుల కుప్ప జనం నెత్తిన పడింది. ఓట్లేసి గెలిపించినందుకు అప్పుల మోత మోగిపోవద్దూ.? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.. అంటే ఇదే మరి.!