నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బులుగు మీడియా తీరు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఎక్కడన్నా ఇలా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి వుంటుందా.. ఇలాంటి సందర్భాల్లో.
రాజకీయ పార్టీలు నడుపుతోన్న పత్రికలు, ఛానళ్ళు, ఇతర మీడియా సంస్థలు.. ఇంతకన్నా బిన్నంగా ఆలోచించే పరిస్థితి వుండదు. నిత్యం తమ యజమాని భజనలోనే మునిగి తేలాల్సి వుంటుంది. వరదల దెబ్బకి కొన్ని కుటుంబాల్లో ఒక్కరూ మిగల్లేదు. మరికొన్ని కుటుంబాల్లో పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు.. ఇలా పరిస్థితి అత్యంత బాధాకరంగా వుంది.
ప్రభుత్వం కూలిన ఇళ్ళను తిరిగి కట్టించొచ్చు.. ఆర్థిక సాయం చేయొచ్చు.. కానీ, పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేదు కదా.? అలాంటప్పుడు, బాధిత కుటుంబాల్లో ఆనందం ఎలా వెల్లివిరుస్తుందట.?
పైగా, ముఖ్యమంత్రులు బాధితుల్ని పరామర్శించేటప్పుడు హామీలు గుప్పించడం షరామామూలే. ‘పూర్తిస్థాయిలో ఆదుకుంటాం..’ అని చెబుతారుకానీ, ప్రభుత్వ ఖజానా అందుకు సహకరించదు. ప్రభుత్వం అంచనా వేసిన వరద నష్టం 6 వేల కోట్లకు పై మాటే. మరి, ఆ స్థాయిలో నిధుల్ని ప్రభుత్వం వెచ్చించే పరిస్థితి వుంటుందా.? ఛాన్సే లేదు.
అధికారిక లెక్కలకీ, అనధికారిక నష్టానికీ చాలా తేడా వుంటుంది. ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల్లో ముందస్తుగానే అధికార పార్టీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. బాధితుల్ని ముందుగానే గుర్తిస్తారు. ఇవన్నీ ఏ ప్రభుత్వంలో అయినా జరిగేవే.
ఇందులో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా చొచ్చుకుని వస్తుంటారు. నిజమైన బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందదు సరికదా, అధికార పార్టీకి చెందినవారికి అప్పనంగా బహుమతులు అందుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ‘వరద బురద రాజకీయం’ కథ చాలా పెద్దదే.
జరుగుతున్న పబ్లిసిటీకీ బాధితులకు అందే సాయానికీ అస్సలేమాత్రం పొంతన వుండదు. వరద బాధితులు.. ఎప్పటికీ బాధితులే.. వారికి సాంత్వన ప్రభుత్వాల నుంచి అందుతుందనడం హాస్యాస్పదం కాక మరేమిటి.?