YS Jagan: మాటకు ముందొకసారి.. తర్వాత ఇంకోసారి.. ‘దేవుడి దయతో..’ అంటుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట కూడా తరచూ ఆయన నోట వస్తుంటుంది. మూడు రాజధానులు కావొచ్చు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం కావొచ్చు.. అను నిత్యం, వైఎస్ జగన్ నోట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో.!
దేవుడి స్క్రిస్టు ప్రకారమే అనుకోవాలో.. ఆ మూడు గురించి పదే పదే మాట్లాడటం వల్ల ఆ ‘మూడు’తోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘దేవుడు’ షాక్ ఇచ్చాడోగానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడూ వైసీపీకి షాక్ ఇచ్చాయి. పైగా, ఇక్కడ మూడు ప్రధాన సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు గెలవడం గమనార్హం.
ఒకరేమో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, ఒకరేమో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.. ఇంకొకరేమో కాపు సామాజిక వర్గానికి చెందినవారు.! మొత్తంగా ఈ ముగ్గురూ టీడీపీ నుంచే గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కులాల కుంపట్లను రాజేస్తోందన్నది బహిరంగ రహస్యం. కమ్మ సామాజిక వర్గం మీద అయితే వైసీపీ చిమ్ముతోన్న విషం అంతా ఇంతా కాదు.
రాయలసీమ నుంచే రెండు సీట్లను ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ) టీడీపీ గెలుచుకుంది. రాయలసీమ నిజానికి వైసీపీ కంచు కోట. ‘వై నాట్ కుప్పం..’ అని వైసీపీ నినదిస్తే, ‘వై నాట్ పులివెందుల’ అంటూ, పులివెందులలోనూ వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ. న్యాయ రాజధాని.. అంటూ రాయలసీమ ప్రజల్ని ఊరించిన వైసీపీ.. ఆ న్యాయ రాజధాని పేరుతో టీడీపీని దెబ్బ కొడదామనుకున్న వైసీపీకి.. అక్కడే, ఆ రాయలసీమలోనే పట్టభద్రులు షాక్ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర సంగతి సరే సరి.! పేరుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అసలు సిసలు రాజధాని అదే.! విశాఖ విషయంలో వైసీపీ చేస్తూ వచ్చిన ప్రచారం. ఇక్కడా వైసీపీ బొక్క బోర్లా పడింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కులం చూడం.. మతం చూడం.. అంటుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! పట్టభద్రులూ అవేమీ చూడలేదు.. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లేశారు.
ఇకపై ‘మూడు’ అన్న మాట ప్రస్తావించాలంటేనే మైండ్ బ్లాంక్ అయ్యేలా పట్టభద్రులు తీర్పునిచ్చారు. ‘అబ్బే, మా ఓటర్లు వేరే వున్నారు..’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల బుకాయించొచ్చుగాక… కానీ, డ్యామేజ్ ‘కంట్రోల్ చేయలేని’ స్థాయిలో జరిగింది.