సెల్ఫ్ ట్రోలింగ్ మెటీరియల్‌లా తయారైంది ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. ‘మధుసూధన్ రావ్.. గుర్తు పెట్టుకో..’ అంటూ ఓ పోలీస్ అధికారి మీద అసహనంతో ఊగిపోయారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
‘మీ టోపీ మీదున్న సింహాలు దేనికో తెలుసా.?’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు సినిమాల్లోని కమెడియన్ల కామెడీ సీన్లను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సింహాల’ కామెంట్లతో రీ-క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.
రాష్ట్రంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి హయాంలో అరాచకం రాజ్యమేలుతోందన్నది వైసీపీ ఆరోపణ. ఇదే ఆరోపణలతో అసెంబ్లీ సమావేశాలకు నల్ల కండువాలు భుజాన వేసుకుని వెళ్ళారు వైసీపీ ప్రజా ప్రతినిథులు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ నేతృత్వంలో.
ఈ క్రమంలో వైసీపీ ప్రజా ప్రతినిథులు కొన్ని ప్లకార్డుల్ని తీసుకెళ్ళారు. వాటిని పోలీస్ అధికారులు చించేశారట. అదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనానికి కారణం. ‘ప్రజా ప్రతినిథుల చేతుల్లోని ప్లకార్డుల్ని చింపే కార్యక్రమం చేసే హక్కు మీకెవరిచ్చారు.. మధు సూదన్ రావ్.. గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఒకేలా వుండదు..’ అంటూ వైఎస్ జగన్ ఆవేశంతో ఊగిపోయారు.
అయినా, పోలీస్ టోపీ మీదున్న సింహాల గురించి, పోలీస్ అధికారులకి ‘మీకు వాటి గురించి తెలుసా.?’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేశపడటమేంటో. అదే పోలీస్ అధికారులు, ఆ సింహాల ‘పవర్’ గురించి చెబితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమైపోతారో ఏమో.!
వైసీపీ అధికారంలో వున్నప్పుడు, వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేసిందీ చూశాం. చట్ట సభల్లో, చట్ట సభల బయటా.. అరాచకం రాజ్యమేలిందన్నది నిర్వివాదాంశం. జగన్ అతిగా ఆవేశపడటం దండగ.. ఎందుకంటే, అసలు కథ ఇప్పుడే మొదలైంది.!