జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పర్యటించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో వరదల కారణంగా సంభవించిన పంట నష్టం గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు.!
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చు. ప్రజల బాగోగుల్ని తెలుసుకోవచ్చు. కాకపోతే, వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, వ్యక్తిగత సంపాదన నుంచి కాస్తైనా వరద బాధితులకు సాయం చేయగలగాలి.
విజయవాడ వరదల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోటి రూపాయల విరాళం ప్రకటించారు. కానీ, ఆ మొత్తం ఎలా ఖర్చు చేశారో, అసలు ఆ మొత్తాన్ని ఎవరికి విరాళంగా ఇచ్చారో ఎవరికీ తెలియదాయె.
ఇక, పిఠాపురంలో పర్యటన సందర్భంగా, ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విరుచుకుపడ్డారు వైఎస్ జగన్. దీనికి తోడు సెల్ఫ్ ట్రోలింగ్ కంటెంట్ ‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు’ వుండనే వుంది. జగన్ చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తోంటే, స్థానిక వైసీపీ నేతలు (మాజీ ఎంపీ వంగా గీత తదితరులు) ముక్కున వేలేసుకున్నారు.
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ పేరుని వైఎస్ జగన్ ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యకరం. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అహంకారంతో వైఎస్ జగన్ విర్రవీగారు. ‘దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్’ అని తప్ప, ఎప్పుడూ పవన్ కళ్యాణ పేరుని ప్రస్తావించింది లేదు.
‘అదఃపాతాళానికి తొక్కుతాం కదా..’ అని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నినదించారు, వైసీపీని తొక్కేసి.. 11 సీట్లకు పరిమితం చేశారు కూడా. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో జగన్ మోహన్ రెడ్డికి తెలిసొచ్చింది. ఓడిపోతూనే, ‘పవన్ కళ్యాణ్’ అని తొలిసారి జగన్ మాట్లాడారు.
పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్.. అని పేర్కొంటూ, ‘సినిమా స్టార్’ అంటూ వ్యాఖ్యానించారు వైఎస్ జగన్. సినిమా స్టార్ కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇంకొంచెం జ్ఞానోదయం అవ్వాల్సి వుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అప్పుడు స్పష్టంగా పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.. అని జగన్ ప్రస్తావిస్తారేమో.!
ఇంతకీ, పిఠాపురం వెళ్ళి అక్కడి ప్రజలకు వైఎస్ జగన్ ఏమైనా వరద సాయం ప్రకటించారా.? ప్చ్.. లేదాయె.! ‘ఇంకెందుకు వచ్చాడు.? అసలు పిఠాపురంతో ఆయనకేంటి సంబంధం.?’ అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, వైఎస్ జగన్ పర్యటనపై వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించడంతోపాటు, 400 గ్రామాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు కోట్ల రూపాయలు అందించిన సంగతి తెలిసిందే. ఇది కాక, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇంకో కోటి రూపాయలు విరాళం అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.