వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పులివెందుల నుంచి విజయవాడ వచ్చారు. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడలో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ జగన్, వరదల విషయమై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని రాజకీయ విమర్శలు చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల్ని రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసిందనీ, ముందే ప్రజల్ని హెచ్చరించి వుంటే, ఇంత నష్టం జరిగి వుండేది కాదని వైఎస్ జగన్ ఆరోపించారు. అంతా బాగానే వుందిగానీ, ఈ వరదల్ని.. ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అని అనడమేంటి.?
అసలంటూ ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటే అర్థమేంటో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయినా తెలుసా.? లేదా.? వైఎస్ జగన్ హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అప్పట్లో అదో సంచలనం. అదో విషాదం. మాటలకందని విషాదమది. అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. కానీ, దానికి వైఎస్ జగన్ అప్పట్లో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోలేకపోయారు.
అంతెందుకు, పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన గేటు కొట్టుకుపోతే, దానికి సైతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో బాధ్యత తీసుకోలేని పరిస్థితిని చూశాం. మరిప్పుడు, ప్రకృతి విపత్తుని, ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటూ, అర్థరహితమైన వ్యాఖ్యల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.
కావాలని కుట్ర పూరితంగా ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చి, జనావాసాల్లో నింపి, వరదల్ని తీసుకురాలేదు కదా ఎవరూ.? ఏదన్నా ప్రాజెక్టుకి కుట్ర పూరితంగా ఎవరూ గండి కొట్టలేదు కదా.? మరి, మ్యాన్ మేడ్ ప్లడ్స్ ఎలా అవుతాయ్ ఇవి.?
ముఖ్యమంత్రి పదవి పోయాక కాదు, ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఇంగితం లేదనడానికి చాలా నిదర్శనాలున్నాయ్. ప్రజలు వరద ముంపులో వున్నారు.. ఇలాంటి సమయంలో, ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటూ కామెడీ చేయొచ్చా.? ఎవరు రాసిస్తున్నారోగానీ, ఇంత చెత్త స్క్రిప్టుని వైఎస్ జగన్, ఇంత గుడ్డిగా ఎలా ఫాలో అయిపోతున్నారో ఏమో.