విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా వినియోగించాలి.? అన్న విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ అదే రోజు చెప్పారు.
కానీ, ఇంతవరకు ఆ కోటి రూపాయల విరాళం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ‘కోటి రూపాయల’ విరాళాన్ని చెక్కు రూపంలో అందించేశారు.
మరోపక్క, ఇంకో నాలుగు కోట్ల రూపాయల్ని ఈ నెల నాలుగున, మొత్తం 400 పంచాయితీలకు లక్ష రూపాయల చొప్పున అందించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయల విరాళం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇచ్చే ఆలోచన లేనప్పుడు వైఎస్ జగన్ ఎందుకు విరాళం ప్రకటించినట్లు.? అని జనం చర్చించుకుంటున్నారు.
ఆ విరాళం ఏదో, ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించెయ్ జగనన్నా.. అని వైసీపీ శ్రేణులు కూడా తమ అధినేతకు విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి సందర్భాల్లో విరాళం ప్రకటించడం.. అంటే, ముఖ్యమంత్రి సహాయ నిధికే నేరుగా అందిస్తుంటారు.
లేదంటే, అసలు విరాళం అనే మాటెత్తకుండా.. పార్టీ తరఫున సహాయ కార్యక్రమాలు చేయొచ్చు. వైసీపీ నేతలు కొందరు, అదే పని చేస్తున్నారు. పార్టీలు.. రాజకీయాల సంగతెలా వున్నా, ప్రజలు కష్టాల్లో వున్నప్పుడు, ఆదుకోవడం రాజకీయ నాయకుల విధి.
ఇంతకీ, జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళమెక్కడ.? జవాబుదారీతనం, విశ్వసనీయత ఏదీ.? ఎక్కడ.?