మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట.
అంతకు ముందెన్నడూ ఇలాంటి వార్తని బహుశా వైసీపీ శ్రేణులు విని వుండకపోవచ్చు. వైఎస్ జగన్ ఏంటి.? సాయం చేయడమేంటి.? అని వైసీపీ శ్రేణులు విస్తుపోతున్నాయన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.
కొన్ని సందర్భాల్లో వైసీపీ తరఫున ‘సాయం’ ప్రకటించి వుండొచ్చు. కానీ, బాధిత కుటుంబాలకు ఆయా సాయాలు అందాయా.? అన్నదానిపై చాలా అనుమానాలున్నాయి. కోవిడ్ సమయంలోనూ ఈ పరిస్థితిని చూశాం.
ఆపరేషన్ సిందూర్‌లో భారత జవాను మురళి నాయక్, వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా తాను సైతం మరో 25 లక్షల రూపాయల్ని బాధిత కుటుంబానికి అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా, మురళీ నాయక్ కుటుంబాన్ని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన జగన్, తన హయాంలోనే ఈ 50 లక్షల సాయానికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లు సొంత డబ్బా కొట్టుకున్నారు.
మరోపక్క, ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ సైతం, పార్టీ తరఫున పాతిక లక్షల రూపాయల సాయాన్ని జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అందజేస్తామని ప్రకటించడం గమనార్హం.
అయితే, మొన్నామధ్యన బెజవాడ వరదల నేపథ్యంలో కోటి రూపాయల సాయం వరద బాధితుల కోసం ప్రకటించినా, ఆ మొత్తాన్ని ఎవరికి ఎలా ఇచ్చారో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి, ఇప్పుడు ఈ పాతిక లక్షల ప్రకటన సంగతేంటి.? ఇస్తారనే, ఆశిద్దాం.
ఏదిఏమైనా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఈ మార్పు మంచిదే. ముందు ముందు వైఎస్ జగన్ కూడా, ‘సాయాలు’ బాగానే చేయాల్సి వస్తుందేమో.
