పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ డీఎస్‌పీ ఏం చేసినట్లు.? ఇంతకీ, అసలేమయ్యింది.?
‘హత్య’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. ఇది వైసీపీకి అనుకూలంగా తీసిన సినిమా. 2019 ఎన్నికల సమయంలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి తెరకెక్కించిన సినిమా ఇది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైసీపీ తీసిన సినిమా ఈ ‘హత్య’.
వైసీపీ అనుకూల సినిమా కావడంతో, సినిమాలో సన్నివేశాలు వైసీపీ కనుసన్నల్లోనే తెరకెక్కాయి. మరోపక్క, ఈ సినిమా తనను కించపర్చేలా వుందనీ, తన కుటుంబ సభ్యుల్ని కించపర్చేలా వుందనీ ఆరోపిస్తూ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు అయిన సునీల్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ అనే వ్యక్తిని విచారణకు పిలిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్ పేరుతో చెలామనీలో వున్న వాట్సాప్ గ్రూపుకి అడ్మిన్‌గా వున్నారు పవన్ కుమార్. కాగా, తనను విచారణకు పిలిచి తీవ్రంగా కొట్టారంటూ డీఎస్‌పీ, సీఐ మీద ఆరోపణలు చేస్తూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కుమార్ ఫిర్యాదు చేయడం గమనార్హం.
పవన్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో వైఎస్ జగన్, పై విధంగా స్పందించారు. పోలీసులు తప్పు చేస్తే, శాఖా పరమైన చర్యలుంటాయి. న్యాయ వ్యవస్థ నుంచి కూడా మొట్టికాయలు తప్పవు. అంతేగానీ, అధికారంలోకి వచ్చాక డీఎస్‌పీతో, నిందితుడికి క్షమాపణ చెప్పిస్తాననే ప్రకటన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయడమేంటి.?
ఇలాగైతే, పోలీసు శాఖ సజావుగా పని చేయగలుగుతుందా.? ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ ఇప్పుడే ఇలా అంటున్న వైఎస్ జగన్, అధికారంలో వున్నప్పుడు, ఎంతమంది పోలీసు అధికారులతో ఇలా తమ కార్యకర్తలకు క్షమాపణ చెప్పించినట్లు.?
అసలు ఇదేం పద్ధతి.? వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగేలా వ్యవహరించింది చాలక, మళ్ళీ అలాంటి చీకటి పరిస్థితుల్ని తీసుకొస్తామనే సంకేతాల్ని వైఎస్ జగన్ పంపడం అస్సలేమాత్రం క్షమార్హం కాదు.