వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్ కి పూనకాలు వచ్చేస్తాయి. సమయం, సందర్భం లేకుండా ఆయనపై వ్యక్తిత్వ హననానికి దిగుతారు జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలోనూ పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు.
గ్యారేజ్ లో కార్లను మార్చినట్లు పవన్ భార్యలను మారుస్తారని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. దత్తపుత్రుడు, వీకెండ్ పాలిటీషియన్ అని సంబోధిస్తూ రెచ్చిపోయేవారు. కానీ శుక్రవారం మాత్రం పిఠాపురంలో పర్యటించినప్పుడు జగన్.. పవన్ ఊసే ఎత్తలేదు. సాధారణంగా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు అక్కడి ఎమ్మెల్యేలను బాధ్యులను చేస్తూ విమర్శించడం రాజకీయ నాయకులకు అలవాటే కదా. కానీ శుక్రవారం అలాంటివేవీ చోటు చేసుకోలేదు.
జగన్ ఎప్పటిలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తూ తన ప్రసంగం మొదలుపెట్టాడు. ఎన్నికల ప్రచారంలో చంద్ర బాబు ఇచ్చిన హామీలను ఇమిటేట్ చేస్తూ మోనో యాక్షన్ కూడా చేశారు. అప్పుడు కూడా పవన్ ప్రస్తావన తీసుకురాలేదు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ లో వచ్చిన ఈ హఠాత్పరిణామానికి కారణమేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ పై ఇప్పుడు కూడా విమర్శలు చేస్తే నెగిటివిటీ మూట కట్టుకుంటారని జగన్ ఆలోచించారా?
అప్పట్లో పదేపదే పవన్ గురించి మాట్లాడటం కూడా ఎన్నికల్లో ఘోర ప్రభావానికి కారణమైందని వైసిపి అధినేత భావించారా? సొంత నియోజకవర్గంలో పవన్ పై విమర్శలు చేస్తే ఇబ్బందులు తప్పవని జగన్ అనుకున్నారా? ఏమో కారణాలు ఏవైనా ఉండొచ్చు.. కానీ జగన్ మాత్రం పవన్ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.