అరరె.. వైసీపీకి ఎంత కష్టమొచ్చింది.? వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టయ్యారు.. మరో వైసీపీ నేత అబ్బయ్య చౌదరి రేపో మాపో అరెస్టవనున్నారు.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు.. కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు.! వైఎస్ జగన్ మాత్రం, బెంగళూరు – గన్నవరం మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అన్నట్టు, మొన్నీమధ్యనే విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చారు.
అంతేనా, సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో తనదైన స్టయిల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా, ‘రాష్ట్రంలో చట్టానికీ, న్యాయానికీ చోటు లేకుండా పోయింది..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాపోతూ ఓ ట్వీటేశారు.
అసలంటూ చట్టం, న్యాయం లేకపోతే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇలా షటిల్ సర్వీస్ బెంగళూరు – గన్నవరం మధ్యన చేసే అవకాశం వుండేదా.? ముందైతే, ఆయనే కదా జైల్లోకి వెళ్ళేది.? నాన్సెన్స్.. ఈ మాత్రం సోయ వుంటే, ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అవుతారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి మరి.
వైసీపీ హయాంలో కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్ట్, చింతకాయల అయ్యన్నపాత్రుడి మీద కక్ష పూరిత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్, విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని అరెస్టు చేసేందుకు కుట్ర.. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా చాలా పెద్దదే.
వైసీపీ నుంచే ఎంపీగా అప్పట్లో గెలిచిన రఘురామకృష్ణరాజు మీదనే కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘనత వైఎస్ జగన్ సర్కారుదే కదా.! వైసీపీ నాయకుల్నే వైసీపీ ప్రభుత్వం హింసించిన పరిస్థితుల్ని చూశాం. చిన్న అనుమానమొచ్చినా, తమ పార్టీ నేతలని కూడా చూడలేదు వైసీపీ
అత్యంత కిరాతకంగా గూండాల్నీ, రౌడీల్ని దించి.. ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల్ని, ఒక్కోసారి తమ మాట వినని సొంత పార్టీ నేతల్నీ కొట్టించి, వీడియోలు తీసి, వాటిని వైసీపీ అధినాయకత్వానికి పంపి.. పైశాచికానందం పొందారు కొందరు వైసీపీ నాయకులు.
ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా.? ఛాన్సే లేదు.! అప్పుడు, అంటే తన హయాంలో గల్లంతయిన చట్టం, న్యాయం.. గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.
కూటమి ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తోందనడానికి నిదర్శనం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా జైలుకు వెళ్ళకపోవడమే. జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమోనన్న భయంతోనే వైఎస్ జగన్, రాష్ట్రంలో వుండేందుకు భయపడుతున్నారన్నది బహిరంగ రహస్యం.
అధికారంలో వున్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏడుపు, పెడబొబ్బలతో సాధించేదేమీ లేదు. అయినా, జగన్ తనంతట తానుగా ఆ ట్వీట్లను వేశారని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే, అవి చదివేంత తీరిక ఆయనకే లేదు.!
ట్విట్టరులో అర్థం పర్థం లేని ట్వీట్లేయడం మానేసి, అసెంబ్లీలో తన వాయిస్ వినిపించేందుకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే, పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేకి, శాసన సభ సభ్యత్వం మాత్రం ఎందుకు.? ఇది పులివెందులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ.