రాజకీయాల్లో విమర్శలు సహజం.! రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, వ్యవస్థలపైనా ఒక్కోసారి విమర్శలు చేయాల్సి వస్తుంటుంది రాజకీయ నాయకులకి. విమర్శలు తప్పు కాదు, కాకపోతే.. హద్దులు దాటే విమర్శలే కొంప ముంచుతాయి. రాజకీయ నాయకుల స్థాయిని దిగజార్చేస్తాయి.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా, పోలీస్ శాఖకి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చేశారు.. అదీ, బట్టలూడదీసి నిలబెడతాం.. అని.! అంతలా పోలీస్ శాఖ ఏం తప్పు చేసిందట.?
విషయంలోకి వెళితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ని ఇటీవల ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో, అంటే వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి నిందితుడిగా వున్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేస్తే, ఆయనిప్పుడు జైల్లో వున్నారు.
ఆ వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం వైసీపీ నేత గనుక, ఆ వంశీ మోహన్‌ని జైల్లో పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళారు. వంశీ అరెస్టుని జగన్ తప్పు పట్టారు. అక్కడితో ఆగిపోతే, ఆయన జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు.?
వీరావేశంతో పోలీస్ శాఖకీ, అందులోని అధికారులకీ, పనిలో పనిగా రాజకీయ ప్రత్యర్థులకీ ‘బట్టలూడదీసి నిలబెడతాం’ అంటూ వార్నింగ్ ఇచ్చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ వార్నింగుని పోలీసు శాఖ గనుక సీరియస్‌గా తీసుకుంటే ఏమవుతుంది.?
జైల్లోనే కదా, వల్లభనేని వంశీ మోహన్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళింది.? ఆ జైల్లో ‘బట్టలూడదీసే కార్యక్రమం’ పోలీస్ శాఖ గనుక చేస్తే.. ఇంకేమన్నా వుందా.? పోలీసు శాఖలో కొందరు అధికారుల మీద రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే, అది మళ్ళీ వేరే చర్చ.
ముందే చెప్పుకున్నట్లు, రాజకీయాల్లో విమర్శలు సహజమే. కానీ, ఈ బట్టలూడదీసే ఫాంటసీ ఏంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? వైఎస్ జగన్ ఉద్దేశ్యం ఏదైనా, ఈ ‘బట్టలూడదీసే’ వ్యాఖ్యలు వైఎస్ జగన్ రెడ్డి అంటేనే అసహ్యం వేసేలా తయారయ్యాయి.
ఎవరో స్క్రిప్టు రాసిస్తే తప్ప, రాజకీయ ప్రసంగాలు చేయలేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇలా నోటికొచ్చింది వాగేసి, తన స్థాయిని తానే దిగజార్చేసుకుంటున్నారు.