‘మనిషికొచ్చినంత కోపం వచ్చింది.. అందుకే, పరువు నష్టం దావా వేస్తానంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..’ ఓ సోషల్ మీడియా పోస్ట్ సారాంశమిది.!
అదానీ – సెకీ ఒప్పందాలు, పదిహేనొందల కోట్లకు పైగా లంచం వైసీపీ ప్రభుత్వానికి అందిన వైనమంటూ ఆరోపణలు.. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మీడియా ముందుకొచ్చి, ‘నాకు శాలువాలు కప్పి, సన్మానం చెయ్యాలి.. అవార్డులేమైనా వుంటే ఇవ్వాలి.. అంతేగానీ, నా మీద అవినీతి ఆరోపణలు చేస్తారా.? పరువు నష్టం దావా వేస్తాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
పరువు నష్టం దావానా.? అదెలా ఉంటుంది.? అని వైఎస్ జగన్ మీద వెటకారాలు షురూ అయ్యాయి సోషల్ మీడియా వేదికగా.
ప్యాకేజీ స్టార్ అనీ, దత్త పుత్రుడనీ పవన్ కళ్యాణ్ మీద ఏ ఆధారాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు.? జగన్ చేసిన పై వ్యాఖ్యల మీద జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గనుక పరువు నష్టం దావా వేస్తే ఎలా ఉంటుందో తెలుసా.? అది వేరే లెవల్ అంతే.!
పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం పరువు నష్టం దావా వేసే అవకాశం వుంది. ఎందుకంటే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ చెలరేగిపోయారు కదా.!
నిజానికి, ఇది ఇంకా సీరియస్ కేసు.! హత్య కేసుని చంద్రబాబు మెడకి చుట్టే ప్రయత్నం జగన్ అండ్ కో చేశారు కాబట్టి, పరువు నష్టం దావా చంద్రబాబు వేస్తే, వైసీపీ ఖేల్ ఖతం అంతే.!
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు అత్యంత సహజం.! పైగా, ఈ అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేసినవి కావు. దేశంలో రాజకీయ నాయకులు చేసినవీ కావు. అంతర్జాతీయ స్థాయిలో నమోదైన కేసు, దీనికి సంబంధించి నమోదైన చార్జి షీటు వ్యవహారం.
ఇంతకీ, వైఎస్ జగన్ ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు.? అమెరికాలో ఈ కేసు విచారణ చేస్తోన్న దర్యాప్తు సంస్థ మీదనా.? అమెరికా అధ్యక్షుడిపైనా.? వైఎస్ జగన్ ప్రెస్ మీట్ల కోసం స్క్రిప్టు రాసేవాళ్ళు కాస్త బాధ్యతతో వ్యవహరించాలి. లేకపోతే, జగన్ నుంచి వచ్చే ఆ మాటలు ప్రతిసారీ కామెడీ అయిపోతున్నాయి.
అన్నట్టు, వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వం మీద ఎడాపెడా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు కొనసాగిస్తూనే వున్నారు. ప్రభుత్వాధినేతల విషయంలో పులివెందుల చేస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు నష్టం దావాలు నమోదైతే ఏంటి పరిస్థితి.?
ఒక్కటి మాత్రం నిజం.. ‘పరువు’ అనే మాటని వైఎస్ జగన్ ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిది. చెల్లెలు కట్టుకున్న పసుపు రంగు చీర మీద రాజకీయ విమర్శలు చేసేంత దిగజారుడుతనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. జగన్ మీద స్వయానా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల పరువు నష్ట దావా వేస్తే ఏంటి పరిస్థితి.?