మూడు రాజకీయ పార్టీలూ అధికారాన్ని పంచుకుంటున్నాయ్.. మిగిలింది మేం మాత్రమే. అంటే, అసెంబ్లీలో ప్రతిపక్షం వుంటే, అది మేమే.! ఆ ప్రతిపక్షానికి ఓ నాయకుడుంటాడు కాబట్టి.. నేనే ప్రతిపక్ష నేతని.! ఇదీ, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదన.!
కొంత సేపు ఈ వాదనే నిజమని అనుకుందాం.! ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సోయ ఎందుకు లేకుండా పోయింది.? ‘దేవుడి స్క్రిప్టు ప్రకారం టీడీపీకి 23 సీట్లే వచ్చాయ్. అందులోంచి ఓ ఏడు సీట్లు మేం లాగేసుకుంటే, టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా వుండదు..’ అని ఇదే జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో.. అదీ, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సెలవిచ్చారు.
అలా సెలవిచ్చిన వైఎస్ జగన్, ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోయి.. ‘మేమే ప్రతిపక్షం.. నేనే ప్రతిపక్ష నేతని’ అని చెబుతుండడం హాస్యాస్పదం కాక ఇంకేముంటి.?
పోనీ, అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళుతున్నారా.? అంటే, అసెంబ్లీకి వెళ్ళరట. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో, ప్రెస్ మీట్లు పెడతారట.!
అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన వెసులుబాట్లు ఎలా పొందుతారు.? అది గౌరవ వేతనం కావొచ్చు, ఎమ్మెల్యేకి లభించే భద్రత విషయంలో కావొచ్చు.. ఇతరత్రా సౌకర్యాల విషయంలో కావొచ్చు.! దీనంతటికీ ప్రజాధనం ఖర్చు చేయాల్సి వుంటుంది కదా.?
ఇదిలా వుంటే, అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలే కదా.!
పెద్ద కష్టమే వచ్చింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. నిజానికి, ప్రతిపక్ష హోదాని వైసీపీ కోరుకుంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వాల్సి వుంటుంది.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ సహా.! అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాని పక్షంలో, వారి సభ్యత్వం రద్దయ్యేలా కొత్త చట్టం ఏదైనా తీసుకొస్తే, ప్రజలకు కాస్త ప్రయోజనకరంగా వుంటుంది.
సభకురాని ఎమ్మెల్యేల స్థానంలో సభకు వచ్చే ఎమ్మెల్యేల వల్ల ఆయా నియోజకవర్గ ప్రజలకు కాస్తయినా మేలు జరుగుతుంది కదా.!