మళ్ళీ మళ్ళీ అదే మాట.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఇంకోసారి ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు చేసేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రైతు భరోసా’ పేరుతో నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు సంబంధించి ‘తాజా విడత’ పబ్లిసిటీ స్టంట్ షురూ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రైతుల ఖతాల్లో ‘రైతు భరోసా’ సొమ్ముని జమ చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమా.? ఈ పేరుతో విపక్షాల్ని విమర్శించేందుకు దీన్నొక ‘పబ్లిసిటీ వేదిక’గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చుకున్నారా.? బహుశా రెండోదే నిజమై వుంటుంది. లేకపోతే, క్యాంప్ కార్యాలయంలో కూర్చుని మీట నొక్కితే సరిపోయేదానికి, ఇంత హంగామా ఎందుకు.?
సరే, ముఖ్యమంత్రిగా జనంలోకి వైఎస్ జగన్ వెళ్ళకూడదని ఎవరూ అనలేరు, అనకూడదు కూడా. వెళ్ళి, ప్రజలకు ఏం చెప్పాలి.? తాము ఏం ఉద్ధరించేస్తున్నదీ జనానికి చెప్పాలి. కేంద్ర సాయంతో కలుపుకుని, రైతు భరోసా ఏడాదికి 13,500 రూపాయలు అందిస్తున్నమాట వాస్తవం.
మరి, గడచిన ఏడాది కాలంలో పెరిగిన ఖర్చుల మాటేమిటి.? పన్నుల మోత సంగతేమిటి.? ఈ చేత్తో పది ఇస్తే, ఇంకో చేత్తో వంద లాక్కోవడమే ప్రభుత్వాల ‘యాపారం’. దీనికి ‘సంక్షేమం’ అంటూ చిత్రమైన రీతిలో ప్రచారం చేసుకోవడాన్ని ఏమనుకోవాలి.?
చంద్రబాబు దత్త పుత్రుడు కౌలు రైతు భరోసా పేరుతో లక్ష రూపాయలు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారన్నది వైఎస్ జగన్ విమర్శ. ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు సాయం చేస్తే అది పబ్లిసిటీ స్టంట్ ఎలా అవుతుంది.? పైగా, అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సంపాదన నుంచి చేస్తున్న సాయం.
ప్రభుత్వం తరఫున, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తోన్న రైతు భరోసాతో తమ సొంత పబ్లిసిటీ చేసుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, తన సొంత సొమ్ములు ఖర్చు చేస్తూ కూడా సొంత పబ్లిసిటీ చేసుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్‌కీ ఎంత తేడా.? ఇక్కడ ఎవరు ‘దత్త పుత్రుడు’ అన్నది ప్రజలకే అర్థమవుతోంది.
ఇదే విషయాన్ని నెటిజన్లూ ప్రస్తావిస్తున్నారు.. అధికారంలో వున్నది ఏ దత్త పుత్రుడంటూ సెటైర్లు వేస్తున్నారు.