తండ్రీ కుమార్తెల బంధం పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై మరో కేసు నమోదయింది. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అతనికి మెడికల్ టెస్టులు చేయగా గంజాయి, డ్రగ్స్ సేవించినట్లు వెల్లడైంది. దీంతో అతనిపై 67 B ఐటీ యాక్ట్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు . వీటితోపాటు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. మూడు రోజులపాటు అతడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఓ తండ్రీ కూతుర్ల వీడియో పై యూట్యూబర్ ప్రణీత్.. మరికొందరు యూట్యూబర్లతో కలిసి అసభ్యకర కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు కాస్త వైరల్ అవడంతో.. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ స్పందించి ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరారు. ఈ వీడియో పై ఇతర సెలబ్రిటీలు, నెటిజన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ పోలీసులు ప్రణీత్ పై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు. ఆ వీడియోలో ప్రణీత్ తో పాటు కనిపించిన మరో ముగ్గురు యూట్యూబర్ల పైనా కేసు నమోదయింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.