2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది కేవలం 11 అసెంబ్లీ సీట్లు. అంతకు ముందు, 2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్లు 151. 151 సీట్లతో వేరే పార్టీల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వున్నా, జనసేన పార్టీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా, టీడీపీ ఎమ్మెల్యేలు కొందర్ని వైసీపీ లాగేసుకుంది.
అప్పట్లో అసలు విపక్షమే వుండకూడదన్న ఆలోచనతో వైసీపీ రాజకీయ కుట్రలు నడిచాయి. వై నాట్ కుప్పం.. వై నాట్ 175.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రదర్శించిన అహంకారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయాక, ‘నీతులు’ మాట్లాడుతున్నారు.
ప్రతిపక్షం అనేది వుండాలట.. ప్రతిపక్షం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందట.! వై నాట్ కుప్పం.. అని నినదించినప్పుడు వైఎస్ జగన్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని వుంటే, ఇప్పుడు వైసీపీ 11 సీట్లకు పరిమితం అయి వుండేది కాదు.
తనకు అస్సలేమాత్రం సూట్ అవని విలువలు, విశ్వసనీయత.. అనే డైలాగుల్ని తాజాగా వైఎస్ జగన్ ఇంకోసారి చెప్పేశారు. అంతేనా, ప్రజా తీర్పుని గౌరవించడం చేతకాక, ‘ఈవీఎం ట్యాంపరింగ్’ అంటూ మతిలేని వాదన తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్, ‘ప్రజలు ఆగ్రహిస్తే, టీడీపీ సింగిల్ డిజిట్‌కి పడిపోతుంది’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైఎస్ జగన్‌కి లెక్కలు రావేమో.! సింగిల్ డిజిట్‌కి వైసీపీ కేవలం రెండడుగుల దూరంలోనే వుంది. టీడీపీ గనుక, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంటే, వైసీపీ పరిస్థితి సింగిల్ డిజిట్.!
వైసీపీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్త.. ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలరనీ, అంత గొప్ప పాలన అందించామని కాలర్ ఎగరేసి చెప్పగలమనీ.. జగన్ అంటున్నారు. మరి, జగన్ ఎందుకు కాలర్ ఎగరేసుకుంటూ, రాష్ట్రంలో వుండకుండా, బెంగళూరుకి పారిపోతున్నట్టు.?
