గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో, అది హత్య కేసుగా మారింది. లేదంటే, గుండె పోటుగానే.. చరిత్రలో కలిసిపోయి వుండేది.
వైసీపీ, ఆ పార్టీ అను‘కుల’ మీడియా ఎలా ‘తిమ్మిని బమ్మిని’ చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, వైసీపీ అను‘కుల’ మీడియా చేస్తోన్న దుష్ప్రచారం కూడా పైన చెప్పుకున్న కోవలోకే వస్తుంది.
వైసీపీ హయాంలో తెరపైకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ఆధారంగా వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయనీ, ఈ క్రమంలోనే మనుషుల అక్రమ రవాణా వంటి వ్యవహారాలు జరుగుతున్నాయన్నది జనసేన అధినేత ఆరోపణ.
రాష్ట్రంలో పెద్దయెత్తున మహిళలు మిస్సింగ్ అవడం వెనుక, వైసీపీ అరాచక శక్తులున్నాయని జనసేనాని ఆరోపించారు. ఆ వైసీపీ మూకలకి, వాలంటీర్లు వివిధ సంక్షేమ పథకాల నిమిత్తం సేకరిస్తున్న డేటా ఉపయోగపడుతోందని జనసేన అధినేత ఆరోపించారు.
ఈ విషయమై వైసీపీ, షరామామూలుగానే వక్రీకరణ మార్గాన్ని ఎంచుకుంది. వాలంటీర్లతో కేసులు కూడా పెట్టించింది జనసేనాని మీద. అవేవీ నిలబడలేదనుకోండి.. అది వేరే సంగతి. వాలంటీర్ వ్యవస్థ విషయమై జనసేనాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తాజాగా వైసీపీ అధినేత వ్యాఖ్యానించారు.
అయితే, వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మీద చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ ఇచ్చిన జనసేనాని, వాలంటీర్లను తాను ఏమీ అనలేదనీ, వారు సేకరిస్తున్న డేటాని వైసీపీ మూకలు దుర్వినియోగం చేస్తున్నాయని మాత్రమే అన్నాననీ, మహిళల మిస్సింగ్ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాననీ జనసేనాని చెప్పుకొచ్చారు.
దాంతో, వైసీపీ అధినాయకత్వానికే కాదు, వాలంటీర్ ముసుగులో వైసీపీ కార్యకలాపాలు చక్కబెడుతున్న చాలామంది వైసీపీ కార్యకర్తలకూ షాక్ తగిలింది.