పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం కోసం దాదాపు 82 లక్షల రూపాయల బిల్లుల్ని విడుదల చేయాలంటూ పంచాయితీ రాజ్ శాఖ ఓ జీవో విడుదల చేసిన మాట వాస్తవం.
ఇది పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం, ఇదేమీ పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కాదు. అధికారిక నివాసం కూడా కాదు.! పైగా, 82 లక్షల రూపాయలు వెచ్చించడం అనేది, ఒక్క నెల కోసం కాదు. తొమ్మిది నెలల కోసం.
హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్, సెక్యూరిటీ సర్వీసెస్.. సహా పలు అంశాలు ఇందులో స్పష్టంగా ప్రస్తావించబడి వున్నాయి. క్యాంప్ కార్యాలయమంటే, సిబ్బంది తప్పనిసరి. ఆ సిబ్బంది జీత భత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది కూడా.!
తన క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ తదితర వ్యవహారాలకు సంబంధించి, ప్రభుత్వం నుంచి పైసా కూడా తీసుకోవడంలేదని గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏమో, ప్రభుత్వానికెందుకు అదనపు ఖర్చు.. అని, ఈ మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన జేబులోంచే ఖర్చు చేయడానికి ముందుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన క్యాంపు కార్యాలయంలో కోట్లాది రూపాయల ఖర్చుతో దుబారా చేశారు.
ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా, ఆ ఫర్నిచర్‌ని ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి తిరిగిచ్చిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఈ విషయమై జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాసినా, అట్నుంచి స్పందన లేదాయె. ఈ విషయమై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది కూడా.!
విజయవాడ వరదల నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఏపీ డిప్యూటీ సీఎం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతే కాకుండా, 400 పంచాయితీలకు మొత్తంగా నాలుగు కోట్ల రూపాయల విరాళాన్నీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికీ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
తన స్వార్జితం నుంచి, ఇలా విరాళాలు అందించే పవన్ కళ్యాణ్, ప్రభుత్వం నుంచి తన అవసరాల నిమిత్తం వృధా ఖర్చు చేయిస్తారా.? ఛాన్సే లేదు. కానీ, డిప్యూటీ సీఎం కార్యాలయం, ఆయా విభాగాలకు సంబంధించిన ఖర్చులు.. ఇవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. అది ప్రభుత్వం తాలూకు బాధ్యత కూడా.
ఇవన్నీ వైసీపీకి తెలియనివి కావు. కేవలం ఎగ్ పఫ్ కోసం మూడున్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తినేసిన ఘనత వైసీపీది. విశాఖలో విలాసవంతమైన నివాసం కోసం ఐదొందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన పాపం వైసీపీది. కేవలం 82 లక్షల రూపాయలు, అదీ బాధ్యతాయుతంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తే, వైసీపీ ఏడుస్తోంది.!
దురదృష్టమేంటంటే, ఇంతలా వైసీపీ దుష్ప్రచారాన్ని చేస్తున్నా, ఖండించాల్సిన స్థాయిలో ఆ దుష్ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం ఖండించలేకపోవడం.!