ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! కానీ, చట్ట సభల్లో మాత్రం.? ప్చ్.. చాలా చాలా తక్కువ ప్రాతినిథ్యమే.! రాష్ట్రపతిగా అవకాశమిచ్చాం.. స్పీకర్‌గా అవకాశమిచ్చాం.. కేంద్ర మంత్రిగా ఫలానా కీలక శాఖకి అవకాశమిచ్చాం.. ఇలా చెప్పుకోవడమే.!
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి.! ఒకవేళ మహిళా ప్రజా ప్రతినిథులు వున్నా, వారి వెనకాల.. చక్రం తిప్పేదంటే, పురుష పుంగవులే.! అది భర్త కావొచ్చు, తండ్రి కావొచ్చు.. సోదరుడు కావొచ్చు. ఇది బహిరంగ రహస్యం.
ఇప్పుడిక, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకొచ్చింది. కేంద్ర క్యాబినెట్, సంబంధిత బిల్లుకి ఆమోదం తెలిపింది. బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడం లాంఛనమే.!
ఇదేదో కొత్తగా పెట్టబోతున్న బిల్లు అనుకునేరు. గతంలోనే పెట్టారు. అప్పట్లో ఆమోదం పొందలేదు. రాజ్యసభ అంగీకరించినా, లోక్ సభ లైట్ తీసుకుంది గతంలో ఓ సారి. సో, ఈసారైనా, బిల్లు చట్ట రూపం దాల్చుతుందా.? ఏమో అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
అయినా, ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటున్నాం కదా.? 33 శాతం రిజర్వేషన్ ఏంటి.? 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కదా.? ఔను, ఇది కూడా పాయింటే.! 33 శాతం రిజర్వేషన్ ఒకవేళ ఇచ్చినా, దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ చేసే పబ్లిసిటీ స్టంట్లు ఎలా వుంటాయో ఊహించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
మహిళలూ.. మహరాణులూ.. అంటుంటాం.! కానీ, రాజకీయాల్లో మహిళలు తమ స్థాయిని ఎలా దిగాజార్చేసుకుంటున్నదీ చూస్తున్నాం.! ఒకప్పుడు పురుష రాజకీయ నాయకులు పరుష పదజాలానికి కేరాఫ్ అడ్రస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు, ‘ఇక్కడా మాదే ఆధిపత్యం’ అన్నట్లు మహిళా రాజకీయ నాయకులు చెలరేగిపోతుండడం చూస్తున్నాం.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ మంచి నిర్ణయమే.! కానీ, ఆ చట్ట సభల గౌరవం, పురుషాధిక్య సమాజంలో సర్వనాశనమైన దరిమిలా, మహిళా మణులు, ఆ చట్ట సభల గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తారా.? చేస్తారనే ఆశిద్దాం.