వాలంటీర్ వ్యవస్థ లేకపోతే, రాష్ట్రం కుదేలయిపోయినట్లే.! వాలంటీర్లు లేకపోవడంతో అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోతున్నారు.! ఇదీ, ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రచారం. అసలు వాలంటీర్లు అంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలు.!
వైసీపీ హయాంలో తెరపైకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, అనేక అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలున్నాయి. ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, అందిన కాడికి వైసీపీ నేతలు దోచుకున్నారన్న ఆరోపణలు అనేకం.
సరే, వాలంటీర్లు అంతా అంతేనా.? అంటే, కాదనే చెప్పాలి. అయినాగానీ, ‘వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే..’ అని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. పార్టీకి అనుగుణంగా వాలంటీర్లు పని చేయకపోతే, వాళ్ళని తొలగిస్తామని అప్పటి మంత్రులూ, ఇతర వైసీపీ నేతలూ హెచ్చరించడం చూశాం.
కానీ, వాలంటీర్లతో పని లేకుండానే పెన్షన్ల పంపిణీ ఆంధ్ర ప్రదేశ్‌లో వరుసగా రెండు నెల కూడా సజావుగా సాగడం గమనార్హం. ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ షురూ అయ్యింది. సాయంత్రానికి 96 శాతం మంది లబ్దిదారులకు సామాజిక పెన్షన్లు.. వారి ఇంటి వద్దనే అందాయి.
ఇంకెందుకు వాలంటీర్ వ్యవస్థ.? ఔను, ప్రభుత్వంలో ఉద్యోగులున్నారు.. అధికారులు, సిబ్బంది.. వెరసి, ప్రజలు కట్టే పన్నుల్ని జీతాలుగా పొందేవాళ్ళుండగా, ఈ వాలంటీర్లెందుకు.? ఇప్పుడు ఇదే ప్రశ్న సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచీ వస్తోంది.
అలాగని వాలంటీర్లను తొలగించెయ్యాలా.? అంటే, అందర్నీ తొలగించేయాల్సిన అవసరం లేదు. వైసీపీ కోసం పనిచేసిన వాలంటీర్లు, ఎన్నికల సమయంలోనే రాజీనామా చేసేశారు. మిగిలిన వాలంటీర్లకు, ప్రస్తుత ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఉపాధి మార్గం చూపించాల్సి వుంది.
తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు నెలకు పది వేలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. వారిలో వృత్తి నైపుణ్యాల్ని వెలికి తీసి, వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి అనుగుణంగా.. ఉపాధి కల్పిస్తే మంచిదేగా.!