దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని, రాష్ట్రపతి సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు.. ఈ హంగామా మాత్రమే కాదు.! అంతకు మించి.!
రాజధాని అయి వుండీ, మాకేంటీ తిప్పలు.? అని మంచి నీళ్ళ విషయంలోనూ, ట్రాఫిక్ విషయంలోనూ.. ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలనే డిమాండ్ కూడా లేకపోలేదు. ఇన్ని ప్రత్యేక సమస్యల నడుమ, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీ ప్రజలకు ఓ సదవకశావంగా కనిపించింది అప్పట్లో.
కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీని సైతం లెక్క చేయకుండా.. ఢిల్లీ ప్రజానీకం, ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో బంపర్ మెజార్టీని ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి అంతటి విక్టరీ దక్కడం వెనుక, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇమేజ్ కూడా కీలక పాత్ర పోషించిందన్నది నిర్వివాదాంశం.
అధికారంలోకి వచ్చాక, అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్ మంచి పేరే తెచ్చుకున్నారు. కాకపోతే, ప్రతిసారీ కేంద్రంతో లడాయి.. ఆమ్ ఆద్మీ పార్టీ కొంప ముంచింది. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సహా, పలు అంశాలపై కేంద్రంతో పంచాయితీ పెట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. అంతే కాదు, కేంద్ర పాలిత రాష్ట్రమైన ఢిల్లీకి అన్నీ తానే అయి వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్‌తోనూ అరవింద్ కేజ్రీవాల్‌కి అస్సలు పొసగేది కాదు. అలా, వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి.
పాలన పక్కన పెట్టి, రాజకీయ వివాదాలతోనే అరవింద్ కేజ్రీవాల్ టైమ్ పాస్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాదు. అదొక జాతీయ పార్టీ. వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీపై ఫోకస్ కూడా తగ్గింది అరవింద్ కేజ్రీవాల్‌కి.
అన్నిటికీ మించి, లిక్కర్ స్కామ్.. అరవింద్ కేజ్రీవాల్‌ని పాతాళానికి పడేసింది. మంత్రులు అరెస్టవడం, ఆయనా ఈ కేసులో పూర్తిస్థాయిలో ఇరుక్కుపోవడం.. వెరసి, ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత పెరిగింది. అదే, తాజా ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమికి కారణం.
చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకున్నాసరే, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది నిజంగానే చావు దెబ్బ. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యం. అధికారంలో వున్నప్పుడే, చాలా సెగ ఎదుర్కొన్నారు కేజ్రీవాల్. ఇప్పుడిక అధికారం కోల్పోయి.. కేజ్రీవాల్ ఏం చేయగలరు.? పార్టీ నుంచి గెెలిచిన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోగలరు.?
ఆకాశమంత ఎత్తుకి ఎదిగి, పాతాళానికి పడిపోవడమంటే ఇదే. ఇది స్వయంకృతాపరాధం.!
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని ఒకప్పుడు విద్యావంతులు, ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడ్డారు. ఎప్పుడైతే కాంగ్రెస్‌తో జతకట్టారో, అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి బీజం పడింది. ఆ కాంగ్రెస్ దెబ్బ, ఆమ్ ఆద్మీ పార్టీని పాతాళానికి తొక్కేసింది. తాను నాశనమైపోయి, పక్క పార్టీల్ని నాశనం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. చిత్రమేంటంటే ఢిల్లీలో ఓటు శాతం కాస్త పెంచుకున్న కాంగ్రెస్, ఒక్క సీటుని సైతం గెలుచుకోలేకపోయింది.
కాంగ్రెస్ – ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఓట్ల చీలిక, బీజేపీకి కలిసొచ్చిందన్నది ఓ విశ్లేషణ. అయితే, బీజేపీ బంపర్ విక్టరీ కొట్టబోతోందని ఎన్నికలకు ముందు నుంచీ జనాల్లో నడుస్తున్న చర్చ. అదే నిజమైందిప్పుడు.. ఎన్నికల ఫలితాల తర్వాత.
మొత్తమ్మీద ఆమ్ ఆద్మీ పార్టీకి, అంచనాలకు మించిన రీతిలో డ్యామేజ్ జరిగిపోయిందన్నది నిర్వివాదాంశం. ఇదివరకటిలా ప్రజా పోరాటాలు చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి వుండకపోవచ్చు. అదే సమయంలో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.