పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నారట.! అదేంటీ, కడప ఎంపీగా ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కదా.? అంటే, అవినాష్ రెడ్డి మీదున్న ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన’ కేసులో, ఆయన దోషిగా తేలతాడు కాబట్టి, అనర్హత వేటు పడితే, ఆ సీటు నుంచి వైఎస్ జగన్ పోటీ చేస్తారా.? మరి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం సంగతేంటి.?
ఇదేదో టీడీపీ అను‘కుల’ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త అయితే, ఆ వార్తలో వింతేమీ లేదు. కానీ, వైసీపీ అను‘కుల’ మీడియాలో ఈ గాసిప్ సర్క్యులేట్ అవుతోంది. వైసీపీకి మద్దతుగా నినదిస్తున్న అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇప్పుడీ గాసిప్ హాట్ టాపిక్ అయి కూర్చుంది.
ఇంతకీ, ఇదంతా నిజమేనా.? అంటే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనతో కలుపుకుని మొత్తంగా వున్న 11 మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షాన్ని నిలదీసే పరిస్థితి లేదు. అసలు అసెంబ్లీలో వైసీపీకి మాట్లాడే ఛాన్స్ చాలా తక్కువే వుండొచ్చు.
అందుకే, వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు. కానీ, అది దొరికే పరిస్థితి లేదు. అసలంటూ అసెంబ్లీకి వెళ్ళడమే దండగ.. అన్న అభిప్రాయానిక వైఎస్ జగన్, ఎన్నికల్లో ఓడిపోగానే వచ్చేశారు. అదే, లోక్ సభకు వెళితే, ఒక్క ఎంపీకి అయినా ఢిల్లీలో విలువ వుంటుంది. అద్గదీ అసలు సంగతి.
కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర బిందువు అయ్యే కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంగతేంటట.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎలాగోలా వైఎస్ జగన్ బుజ్జగించడానికి లేదు. రాజీనామా విషయంలో అవినాష్ రెడ్డి ససెమిరా అనడం ఖాయం. అంటే, ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, అవినాష్ రెడ్డి మీద ఆరోపణలున్నా, అరెస్టు నుంచి ఆయన తప్పించుకుంటూ వస్తూనే వున్నాడు. సో, అవినాష్ రెడ్డికి అరెస్టు భయం కాస్త వున్నా, ఆ భయంతో ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం లేదు. అరెస్టయినా, ఎంపీ పదవి పోతుందని అనడానికీ లేదు.
వైసీపీకి మొత్తంగా ఇప్పుడు నలుగురు ఎంపీలే వున్నారు. అందులో ఒకరితో రాజీనామా చేసేంత తింగరి పని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే అవకాశమే లేదు. కానీ, ఆయన లోక్ సభకి వెళ్ళాలన్న ఆలోచన అయితే చేసేందుకు అవకాశం వుంది. ముందే చెప్పుకున్నట్లు, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.
ఎంపీగా ఢిల్లీలో వుంటే, ఢిల్లీ పెద్దల్ని (బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు) ప్రసన్నం చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏదన్నా మార్గం దొరకొచ్చు. ఏపీలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా జగన్ ఢిల్లీకి వెళితే, ఓ ఎంపీకి వున్న వెసులుబాటు కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌కి వుండదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఒకవేళ అన్నీ ఈక్వేషన్లూ సరిగ్గానే వున్నాయని భావించి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తే, అది ఆమోదం పొందితే, కడప లోక్ సభ సీటు కూడా ఖాళీ అయితే, ఆ రెండిటినీ కూటమి గనుక కొట్టేయగలిగితే.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది జగన్ రాజకీయ జీవితం.