ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు భయపడుతుంది.? దేవుడి స్క్రిప్టు ప్రకారం కేవలం 23 సీట్లకే పరిమితమైన టీడీపీ అంటే, ‘దేవుడి ఆశీస్సులున్న’ వైసీపీ భయపడే పరిస్థితి ఎందుకు వస్తుంది.?
రాజకీయాల్ని ఓ పట్టాన అంచనా వేయడం కుదరదు.! 2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మారిన సమీకరణాలు వేరు. ఆ విషయం వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టంగా అర్థమవుతోంది.
మహిళలు ధరించే నల్ల చున్నీల్ని చూసి కూడా అధికార వైసీపీ భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. డబ్బులిచ్చి జనాన్ని సభలకు రప్పిస్తున్నా, వారిని ఆయా సభల్లో కాస్సేపు కూడా వుంచలేని దయనీయ స్థితి వైసీపీ అధినాయకత్వానికి అర్థం కాకుండా వుంటుందా.?
లంక, రావణుడు.. అంటూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏవేవో మాటలు చెప్పారు. కానీ, ఎవరు రావణుడు.? ఎవరు రాముడు.? అన్నదానిపై ప్రజలకూ ఓ ఐడియా ఇప్పుడిప్పుడే వస్తోంది. ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చినందుకు తమ జీవితాలు ఎలా మారాయో ప్రజలూ అర్థం చేసుకుంటున్నారు.
అధికార పక్షం మాట ఇచ్చి తప్పుతున్న వైనాన్నీ, మడమ తిప్పుతున్న వ్యవహారాల్నీ ప్రజలు గమనిస్తున్నారు. విపక్షాలు బలపడుతున్న వైనం అధికార పార్టీకే అర్థమవుతోంది. అందుకే, అసలు వాళ్ళు పోటీనే కాదని పైకి చెబుతూ, లోలోపల వణికి ఛస్తున్నారు. విపక్షాల్ని తిట్టడానికే, అధికార పర్యటనల్ని వాడుతున్నారంటే.. అధికార పార్టీ భయం అందులో స్పష్టంగా కనిపిస్తోంది.
బారికేడ్లు.. ముందస్తుగా హౌస్ అరెస్టులు.. ఇవన్నీ ఓటమి భయానికి సంకేతాలే.!