ఇప్పుడు అందరి చూపు ఏపీ అసెంబ్లీ సమావేశాల మీదనే ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దేశ వ్యాప్తంగా ఓ పేరుంది. ఇక్కడ సమావేశాలు చాలా రచ్చ రచ్చగా జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న సమావేశాలకు జగన్ వస్తారా రారా అనే చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకార సమయంలో ఒకసారి మాత్రమే వచ్చారు మాజీ సీఎం జగన్. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగానే ఉన్నారు.
ఇప్పుడు చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలకు జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తారా అంటే అనుమానమే అంటున్నారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్తే తనను ఇరకాటంలో పడేస్తారని జగన్ భావిస్తుండొచ్చు. అంతే కాకుండా అవమానాలు ఎదురవుతాయని కూడా వెనకడుగు వేస్తున్నారేమో. అటు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇంకా రానే లేదు. ఇటు షర్మిలతో ఆస్తుల వివాదాలు, విజయమ్మ లేఖలు.. ఈ పరిస్థితుల నడుమ ఆయన సమావేశాల కోసం సిద్ధంగా లేరని తెలుస్తోంది.
కానీ జగన్ రాకపోతేనే ఆయనకు నష్టం జరుగుతుంది. ప్రజల దృష్టిలో ఆయన మీద వ్యతిరేకత కూడా పెరుగుతుంది. జగన్ సీఎం పదవి పోగానే సమావేశాలకు రావడానికి కూడా అహం ప్రదర్శిస్తున్నాడని కూటమి ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షంగా ఉన్న ఏకైక పార్టీ వెళ్లకపోతే ప్రజల్లో కూడా ఆయన మీద అభిప్రాయం మారుతుంది. ఒకవేళ వెళ్లి అవమానాలు ఎదుర్కుంటే అది ఆయనకు సానుభూతిని పెంచుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించినప్పుడు ఆ ప్రజల దృష్టిలో మంచి నాయకుడు అనిపించుకుంటారనేది జగన్ గుర్తుంచుకోవాలి.