అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరు సలహాలిస్తున్నారోగానీ, ఆయన్ని నవ్వులపాలు చేయాలనే కంకణం కట్టుకున్నట్టున్నారు ఆ ‘సలహాదారులు’.! లేకపోతే, ప్రతిపక్ష హోదా కోసం కోర్టును ఆశ్రయించడమేంటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.?
తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కదా, అసెంబ్లీ ఎంతమంది సభ్యులుంటే ప్రతిపక్ష హోదా వుంటుందో సెలవిచ్చింది.? అలాంటప్పుడు, ఆయన ఏ మొహం పెట్టుకుని 11 మంది ఎమ్మెల్యేలున్న తమకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు.?
సరే, ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా తనకు గతంలో వున్న సెక్యూరిటీనే కొనసాగించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘ప్రాణహాని’ వుందంటూ వైఎస్ జగన్, కోర్టుకు విన్నవించుకోవడం మరో ఆసక్తికర అంశం.
మాజీ ముఖ్యమంత్రి కదా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సెక్యూరిటీ వుండాల్సిందే, వుంటుంది కూడా.! పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి, ఆయనకు ఇవ్వాల్సిన స్థాయిలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. కాకపోతే, మాజీ ముఖ్యమంత్రికి.. ఓ ఎమ్మెల్యేకి అవసరమైన స్థాయిలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వగలుగుతుందిగానీ, అంతకు మించి.. ఎలా ఇస్తుంది.?
న్యాయస్థానమైనా ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పునిచ్చే ఆలోచన చేస్తుందని ఏ న్యాయ నిపుణుడూ విశ్వసించే పరిస్థితి లేదు.
వైఎస్ జగన్ వాలకం చూస్తోంటే, ‘నాకు గతంలోలా ముఖ్యమంత్రి పదవి ఇప్పించేలా చూడాలి..’ అంటూ న్యాయస్థానాన్ని ముందు ముందు ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన పనేముంది.? అసలే, ‘మొన్నటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. జగనన్నా, ఒక్క పిటిషన్ కోర్టులో వేసెయ్.. నువ్వే ముఖ్యమంత్రివి..’ అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెత్తీ నోరూ బాదుకుంటున్నారాయె.!