ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది కాబట్టి రెండో పార్టు మీద ఆటోమేటిక్ గా అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు బన్నీకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఈ సినిమాకే రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ లెక్కలు దిమ్మతిరిగేలా ఉన్నాయి. ఓ పెద్ద సునామీ రాబోతోంది అన్నట్టే ఈ సినిమా లెక్కలు మెంటలెక్కిస్తున్నాయి. ముఖ్యంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్, ఓటీటీ రైట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి.
ఓటీటీ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.250 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకుందంట. ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమాకు కూడా ఇంత పెద్ద డీల్ జరగలేదు. దాంతో ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇక త్రిబుల్ ఆర్ మూవీ రికార్డులను కూడా ఈ మూవీ బద్దలు కొట్టేసిందని అంటున్నారు. తాజాగా థియేట్రికల్ రైట్స్ అయితే మామూలుగా లేవని చెబుతున్నారు. థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.550 కోట్లకు అమ్ముడు పోయాయంట. ఇది ఇండియాలోనే అత్యధికం అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.
త్రిబుల్ ఆర్ మూవీకి కూడా ఇంత భారీగా ధర రాలేదు. త్రిబుల్ ఆర్ కు రూ.500 కోట్ల బిజినెస్ జరిగింది. అప్పుడు బాహుబలి సిరీస్ పెద్ద సక్సెస్ కావడంతో పాటు జక్కన్న మూవీ కాబట్టి ఆ బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు పుష్ప-2కు అంతకు మించి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మరి ఈ మూవీ హిట్ లెక్కలోకి రావాలంటే ఏకంగా రూ.560 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మరి పుష్ప-2 ఆ రేంజ్ లో రాబడుతుందా లేదా అనేది వేచి చూడాలి.