ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు గాను, త్వరలో ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, మూడింటిలో ఒక్కటైనా జనసేన పార్టీకి దక్కుతుందా.? అన్న చర్చ జనసేన శ్రేణుల్లో జరుగుతోంది.
రాష్ట్రంలో కూటమి అధికారంలో వున్న దరిమిలా, కూటమికి చెందిన మూడు పార్టీలు సమానంగా చెరో సీటుని పంచుకునేందుకు ఆస్కారం వుంది. కానీ, టీడీపీ రెండు స్థానాల్ని ఆశిస్తోంది, బీజేపీ ఓ స్థానాన్ని ఆశిస్తోంది. ఈ లెక్కల్లో ఓ లాజిక్ కూడా వుంది. మొత్తంగా ఖాళీ అయిన మూడు స్థానాల విషయానికొస్తే, బీద మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య.. గతంలో ఎంపీలుగా పని చేశారు.. ఈ ముగ్గురూ రాజీనామా చేయడంతో, ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి.
బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. నిజానికి, ఆ ఇద్దరికీ పదవీ కాలం ఇంకా వుంది. ఆర్.కృష్ణయ్యదీ అదే పరిస్థితి. మోపిదేవికి 2026 వరకు పదవీ కాలం వుంటే, ఆర్.కృష్ణయ్య అలాగే బీద మస్తాన్ రావు 2028 వరకూ పదవీ కాలం వున్నా, తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ క్రమంలో తిరిగి ఆ ముగ్గురూ రాజ్యసభ సీట్లను ఆశించడంలో వింతేమీ లేదు. కాకపోతే, బీద మస్తాన్ రావు ఒక్కరికే టీడీపీ నుంచి రాజ్యసభకు అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో టీడీపీ నుంచి అర డజను మంది వరకు నేతలు రాజ్యసభ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు.
ఇంకోపక్క, ఆర్.కృష్ణయ్య వ్యవహారం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఆయన తిరిగి రాజ్యసభ పదవి కోరుకోవడంలేదుగానీ, జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న పదవిని ఆశిస్తున్నారట.
కాగా, రాజ్యసభకు నాగబాబుని పంపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ, రాజ్యసభ సీటు విషయమై జనసేన అధినాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటనా ఇప్పటివరకూ రాలేదు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ‘రాజ్యసభ’ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి అలాగే, లోక్ సభలోనూ సభ్యత్వం వున్న జనసేన పార్టీకి, రాజ్యసభ సభ్యత్వం అదనపు బలాన్నిస్తుందన్నది నిర్వివాదాంశం. మరి, ఈ దిశగా జనసేనాని ఆలోచిస్తే, సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ఈక్వేషన్స్ మారొచ్చు.
ఇప్పుడు ఒకవేళ కుదరకపోతే, ఖచ్చితంగా తదుపరి అవకాశం ముందుగానే జనసేనకు ఇచ్చేలా కూటమిలో ఒప్పందాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.