ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగబోతోందట. ఆయా పార్టీలకు రాబోయే సీట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సర్వే ప్రచారంలో వుంది. సోషల్ మీడియా వేదికగా ఈ సర్వే విషయమై పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది.
అధికార వైసీపీకి ఈ సర్వేలో కేవలం 30 నుంచి 36 సీట్లను మాత్రమే పేర్కొన్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పుంజుకుందనీ, ఆ పార్టీకి 50 నుంచి 55 సీట్ల వరకూ రావొచ్చన్నది సదరు సర్వే సారాంశం. జనసేన పార్టీకే మెజార్టీ సీట్లు దక్కుతాయనీ, జనసేన సొంతం చేసుకోబయే సీట్ల సంఖ్య 80 నుంచి 86 అనీ ఆ సర్వేలో ప్రస్తావించారు.
అసలు ఈ సర్వే ఎప్పుడు చేశారు.? ఎవరు చేశారు.? అన్నదానిపై వివరాల్లేవు. కాకపోతే, వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు ఎక్కువగా ఈ సర్వే గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుండడం గమనార్హం.
‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. వైసీపీ కొంప ముంచేస్తున్నారు. జగనన్న ఎంతలా కష్టపడుతున్నా.. పార్టీ కీలక నేతలు సరిగ్గా పని చేయడంలేదు. అందుకే ఈ దుస్థితి..’ అంటూ ఈ సర్వేపై కామెంట్లు చేస్తున్నారు.
‘మబ్బులు విడిపోతున్నాయ్.. వైనాట్ 175 అని అంటున్నా.. విషయం వేరేలా వుంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారిపోతున్నారు.. ఆ ముప్ఫయ్ సీట్లు రావడం కూడా కష్టమే వైసీపీకి..’ అని వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే కామెంట్ చేస్తున్నారు.
ఇంకోపక్క, జనసేన పార్టీకి అసలు ఆ 85 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులున్నారా.? అని ప్రశ్నిస్తోన్న వైసీపీ నెటిజన్లూ లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీడీపీకి మరీ దారుణంగా 23 సీట్లే 2019 ఎన్నికల్లో వస్తాయని ఎవరైనా ఊహించారా.?
వైసీపీ నుంచి అప్పట్లో టీడీపీ లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23. ఆ సంఖ్యే టీడీపీకి 2019లో వచ్చింది. సో, టీడీపీ నుంచి వైసీపీ లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య, జనసేన నుంచి వైసీపీ లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్యని పరిగణనలోకి తీసుకుంటే, దేవుడి స్క్రిప్టు ప్రకారం వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే రావాలి.. ఇది టీడీపీ, జనసేన నుంచి వినిపిస్తున్న లాజిక్కు.
‘జగనే చెబుతుంటారు కదా పదే పదే.. ఆ దేవుడ్ని నమ్మకున్నాననీ.. దేవుడి స్క్రిప్టు అనీ.! సో, వైసీపీకి సీట్లు ఇంకా తగ్గి.. సింగిల్ డిజిట్‌కే ఆ పార్టీ పరిమితమైతే, జనసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందేమో.!’ అన్నది జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు టీవీ డిబేట్లలో ‘వైఎస్ జగన్.. దేవుడి స్క్రిప్టు’ గురించి ప్రస్తావిస్తూ చేస్తున్న వ్యాఖ్యల సారాంశం.