పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులతో కలిసి ఢిల్లీలో ధర్నాకి ప్లాన్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్ని ఎగ్గొట్టి మరీ, ఢిల్లీలో ‘టూర్’ ప్లాన్ చేసుకుంది వైసీపీ.
ఓ వైపు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటూనే, ఇంకోపక్క అసెంబ్లీ సమావేశాలకు హాజరవకుండా కుంటి సాకులు వెతుక్కుంటున్న వైఎస్ జగన్, ఢిల్లీకి వెళ్ళి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ చేస్తారట. నవ్విపోదురుగాక వాళ్ళకేటి.? అన్నట్లుంది వైసీపీ తీరు.
అంతా బాగానే వుందిగానీ, డిల్లీలో ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి’ అనే డిమాండ్‌తో ప్లకార్డులేవైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రదర్శిస్తారా.? ప్రధాని నరేంద్ర మోడీని ఈ విషయమై నేషనల్ మీడియా సాక్షిగా నిలదీసే సాహసం వైఎస్ జగన్ ఏమైనా చేయగలరా.?
ఢిల్లీకి వెళుతున్నారు కాబట్టి, అదీ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు కాబట్టి, ప్రత్యేక హోదా అంశం కీలకం కాబట్టి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఆ ఢిల్లీ గడ్డపై నినదిస్తే మంచిదే. కానీ, ఆయనకు అంత ధైర్యమెక్కడిది.?
గతంలో, అంటే 2014 నుంచి 2019 మధ్యలో, ప్రత్యేక హోదా కోసం ఏకంగా నిరాహార దీక్షలు చేసేశారు వైఎస్ జగన్. అంతేనా, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిశాక, తమ ఎంపీలతో రాజీనామాలూ చేయించారు. అధికార పీఠమెక్కగానే, అన్నీ మర్చిపోయారు వైఎస్ జగన్.
ఏమో, అధికారం పోయింది గనుక.. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసే ఆలోచనలో జగన్ వున్నారేమో. ముందుగా తమ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తారేమో.? ఢిల్లీ టూర్‌లోనే వైసీపీ ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ) రాజీనామా చేస్తారేమో.? ఏమో గుర్రం ఎగరావచ్చు.!
