మూడేళ్ళ నుంచీ, ఆ మాటకొస్తే ఎనిమిదేళ్ళ నుంచీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒకటే పంచాయితీ.! కాస్త నెమ్మదిగానే అయినా, పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతూ సాగుతూ వచ్చాయి. ఎప్పటికి ఆ ప్రాజెక్టు పూర్తవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని వైసీపీ చెబుతోంది. కానీ, పోలవరం ప్రాజెక్టుని మాత్రం పూర్తి చేయలేకపోతోంది.
రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా, ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా పధ్నాలుగేళ్ళపాటు ఏం చేశారో మాకు అర్థం కావడంలేదు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్..’ అనేశారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, 2020లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని డెడ్‌లైన్ కూడా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మాటేమిటి.?
‘మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ ప్రాజెక్టుని ప్రారంభించారు.. మేం ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం..’ అని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఇప్పటికీ చెప్పలేకపోవడాన్ని ఏమనుకోవాలి.?
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీల పెత్తనం ఎక్కువైపోతోంది. కేంద్రం నిధులు ఇస్తే, రాష్ట్రం ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి వుంది. పైగా, కేంద్రమే పోలవరం ప్రాజెక్టుని పర్యవేక్షిస్తుంటుంది. అలాంటప్పుడు, చంద్రబాబు హయాంలో అయినా, వైఎస్ జగన్ హయాంలోనో.. అవినీతికి ఆస్కారమెలా వుంటుందన్నది ఓ ప్రశ్న.
ఆలస్యానికి కూడా కేంద్రమే బాధ్యత వహించాలి తప్ప, రాష్ట్రంలో వున్న ప్రభుత్వాలు కాదు.! కానీ, కేంద్రాన్ని అడిగి, డిమాండ్ చేసి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వెలగబెట్టిన, వెలగబెడుతున్నవాళ్ళదే కదా.!
ఐదేళ్ళలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని చంద్రబాబు అసమర్థుడైతే, ఆ అసమర్థుడన్న బిరుదుని వైఎస్ జగన్ కూడా తన నెత్తిన కిరీటంగా పెట్టుకుంటారా మరి.? ఇంతకీ, ప్రధాని నరేంద్ర మోడీని పోలవరం ప్రాజెక్టు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు ప్రశ్నించడంలేదు.? ‘ప్రధానిగా అన్ ఫిట్..’ అని నరేంద్ర మోడీపై ఎందుకు విమర్శనాస్త్రాలు సంధించడంలేదు.?