ఏమో గుర్రం ఎగరావచ్చు.. రాజకీయాల్లో ఏదైనా జరగావచ్చు. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. 2019 నుంచి ఐదేళ్లపాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు కావచ్చు..ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ మాట తీరుతోనో లేదా చేష్టలతోనూ ఎప్పుడు వార్తల్లో నిలిచేవారు. మరీ అసెంబ్లీ ఎపిసోడ్ అయితే పక్క రాష్ట్రాల వాళ్లు కూడా నవ్వుకునే స్థాయిలో జరిగేది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీకి అసెంబ్లీలో గొంతెత్తే చాన్స్ లేదనుకోండి అది వేరే విషయం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అనే స్థాయి నుంచి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించే స్థాయికి వాళ్ళ టోన్ పడిపోయింది. అంతటి ఘోర పరాజయం తర్వాత సాక్షాత్తు ఆ పార్టీ అధినేతే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు.
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను అనీ.. హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించిందని ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ పార్టీకి జీవం కావాలి. మళ్లీ పుంజుకుంటామన్న నమ్మకం కావాలి. కలగాలి. అందుకు ఏం చేయాలి? అవినాష్ రెడ్డి తో కడప ఎంపీ సీటుకు రాజీనామా చేయించి, తాను కూడా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే సరిపోతుందా? ఇప్పటికిప్పుడు ఆ రెండు స్థానాలకి ఉప ఎన్నికలు వస్తే ఎవరికి ఎంత లాభం?
అసలే ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేస్తానని, ఇక్కడే కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోదరి సమానురాలైన వైఎస్ షర్మిల గెలుపు కోసం అవసరమైతే జెండాలు మోస్తానని మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. మొదటినుంచి ఆయనకి వారితో సత్సంబంధాలే ఉన్నాయి.
ఏమో జగన్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆ నేతలు షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. ఎందుకంటే వైసీపీని వీడాల్సి వస్తే మరే పార్టీలోనూ చేరే అవకాశం ఉండదు. వాళ్లు రానివ్వరు. ముఖ్యంగా బీజేపీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రిస్క్ తీసుకోదు.
ఇక కాంగ్రెస్ ని బలోపేతం చేసి వైసీపీ కి చెక్ పెట్టేందుకు టీడీపీ కూడా తన వంతు సాయం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లు కడప, పులివెందుల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే షర్మిల అక్కడ పోటీ చేస్తే స్వయంగా టీడీపీ పెద్దలే ఆమె గెలుపు కోసం పనిచేస్తారని అంటున్నారు. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే జగన్ ని ఆ విధంగా అడ్డుకొని ఇంటికి సాగనంపాలనేది వాళ్ళ ప్లాన్.
అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. సాక్షాత్తు జగనే ఏ పదవిలో లేనప్పుడు వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశమే లేదు. ప్రతిపక్షం మాకు కొత్త కాదు.. మళ్లీ జీరో నుంచి మొదలు పెడతాం అంటారా.. అక్కడి నుంచే మొదలుపెట్టినా కూడా పునర్వైభవం అనేది అంత సులువు కాదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.