చైతూ-శోభిత ఈ మధ్య బాగానే సందడి చేస్తున్నారు. ఇప్పటికే సాదాసీదాగా ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట.. డిసెంబర్ 4న పెళ్లి కోసం రెడీ అవుతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను వీరిద్దరే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరి పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలో అతికొద్ది మంది సమక్షంలో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంట. ఆర్బాటంగా చేసుకుంటే తమకు కలిసి రావట్లేదని ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం. గతంలో చైతూ-సమంత పెళ్లి అత్యంత గ్రాండ్ గా చేసినా ఫలితం లేదని.. అందుకే ఇలా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే వీరిద్దరి పెళ్లిని ఓటీటీలో డాక్యుమెంటరీగా చేసేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయంట. ఈ నడుమ సెలబ్రిటీల పెళ్లి వేడుకలను ఓటీటీలో డాక్యుమెంటరీగా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో నయనతార-విఘ్నేష్ పెళ్లిని కూడా ఇలాగే డాక్యుమెంటరీగా తీశారు. ఇప్పుడు చైతూ-శోభిత ప్రేమ వ్యవహారం, పెద్దల అంగీకారం నుంచి పెళ్లి వేడుక దాకా మొత్తం రెండు గంటల డాక్యుమెంటరీగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. కానీ ఓటీటీ సంస్థల ప్రతిపాదనలపై ఇంకా ఎలాంటి క్లారిటీ అక్కినేని ఫ్యామిలీ నుంచి రాలేదని సమాచారం.
ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కచ్చితంగా అభిమానులకు చైతూ-శోభిత పెళ్లి వేడుకను చూసే ఛాన్స్ దక్కుతుంది. చూడాలి మరి ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.