టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ప్రాణ హాని పొంచి వుందన్న ప్రచారం టీడీపీ అను‘కుల’ మీడియా నుంచి మొదలైంది.! నిజానికి, ఇదేమీ కొత్త కాదు.! ఈ తరహా ప్రచారాలు అన్ని రాజకీయ పార్టీలూ చేసుకుంటాయ్.! టీడీపీ చేసుకుంటోందిప్పుడు.!
పొలిటికల్ మైలేజ్ ఈ ప్రచారంతో టీడీపీకి దక్కుతుందా.? లేదంటే, చంద్రబాబుకి ప్రాణ హాని పెరుగుతుందా.? ఈ విషయమై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువే, ఇప్పుడు రాజమండ్రి కారాగానికి ఇన్‌ఛార్జిగా వున్నారట.! అదీ, అందుకే, అంతగా టీడీపీ అనుమానం పెంచుకున్నది.
ఏం, రాజకీయ నాయకులకు బంధువులు వుండకూడదా.? వాళ్ళు రకరకాల ఉద్యోగాలు, వ్యాపకాలూ చేసుకోకూడదా.? టీడీపీకి చెందిన ఎందరో నేతల బంధువులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండొచ్చు. పోలీసు శాఖలోనూ, వైద్య విభాగంలోనూ వుండొచ్చు. వారి వృత్తి ధర్మం వారు పాటిస్తారు.. అందులో వింతేముంది.?
ఇక, ‘అనుమానం’ విషయానికొస్తే.. నిజమే, ఎన్నికల ముందర చంద్రబాబు అరెస్టు జరగకపోవచ్చని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. చంద్రబాబు అరెస్టయ్యే ఛాన్సే లేదని చాలామంది అనుకున్నారు. కానీ, అందరి అంచనాలూ తల్లకిందులయ్యాయి. చంద్రబాబు అరెస్టయ్యారు.
చిత్రమేంటంటే, ఇంతవరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకపోవడం. వ్యవస్థల్ని మేనేజ్ చేయగల దిట్ట అయిన చంద్రబాబుని వైసీపీ ఎలా లాక్ చేయగలిగిందనేది ఓ పెద్ద ప్రశ్న. అంతలా చంద్రబాబుని లాక్ చేయగలిగినప్పుడు, చంద్రబాబుకి ప్రాణ హాని తలపెట్టలేరా.?
అబ్బే, ఎన్నికల ముందర అంత రిస్క్ వైసీపీ తీసుకోదన్నది మెజార్టీ అభిప్రాయం.! చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యక్తమయిన అభిప్రాయాలు ఏమయ్యాయ్.?