ఇప్పుడు అందరి చూపు తిరుమల మీదనే ఉంది. ఎలాగూ లడ్డూ కల్తీ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి భక్తుల్లో కూడా ఎంతో కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు ఇంత పెద్ద తిరుమల దేవస్థానానికి బయటి డెయిరీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. తిరుమలకు సొంతంగా ఒక డెయిరీ ఎందుకు ఉండొద్దనే డిమాండ్లు వస్తున్నాయి. ముందు ఈ ఆలోచనను తెరమీదకు తెచ్చింది బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్. తాను స్వయంగా 10వేల గోవులు ఇస్తానని.. దాతల నుంచి లక్ష ఆవుల వరకు సేకరించి ఇస్తానని.. సొంతంగా డెయిరీ పెట్టాలంటూ ఆయన కోరారు.
ఇదే డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఎలాగూ తిరుమలకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఒకవేళ వాటిని ఖర్చు చేయకున్నా.. తిరుమలకు అంటే దాతలు, మఠాలు కూడా ముందుకు వచ్చి ఆవులను అందజేస్తాయి. కాబట్టి వాటి నుంచి పాలు, పెరుగుతో పాటు నెయ్యి తీసుకుని శ్రీవారి కార్యక్రమాల కోసం వాడుకోవచ్చు. అప్పుడు భక్తుల్లో కూడా నమ్మకం మరింత పెరుగుతుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే ఇప్పటి వరకు ఆ పని ఎవరూ చేయలేదు. కాబట్టి ఇది చంద్రబాబుకు గొప్ప అవకాశం. శ్రీవారి భక్తుల్లో చంద్రబాబు పట్ల ఒక సానుకూలత కూడా పెరుగుతుంది.
అంతే కాకుండా తిరుమల దేవస్థానం ఉన్నన్ని రోజులు చంద్రబాబు హయాంలోనే డెయిరీ ఏర్పాటు చేశారనే పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చంద్రబాబు గనక వినియోగించుకుంటే ఆయన మీద హిందువుల్లో కూడా సానుకూలత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.