ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో పాటు చాలా విషయాల్లో నిధులు కావాలి కాబట్టి వాటి గురించి ఆలోచించి చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు కోరుతున్న కోరికలకు ఒప్పుకోక తప్పట్లేదు. ఎందుకంటే చంద్రబాబు వద్దు అంటే ఎన్డీయే ప్రభుత్వమే ఉండదనేది వారి భయం. అయితే ఒక్క విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు చంద్రబాబుకు మొండి చేయి చూపిస్తున్నారు.
అదే విశాఖ ఉక్కు కంపెనీ విషయంలో. ఏపీకి ఇది ప్రాణసంకటంగా మారిన సమస్య. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా చేస్తారని చంద్రబాబు మీద నమ్మకంతో వారంతా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబుకు ఇది పెద్ద సవాల్ గా మారిపోయింది. ఇదే విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావిస్తే.. వాళ్లు ససేమిరా అంటున్నారు. ఎందుకంటే అది పాలసీ అని.. దాన్ని మార్చడం కుదరదని వాళ్లు తెగేసి చెప్పేస్తున్నారు. కానీ అది సాధించకపోతే మాత్రం చంద్రబాబు ఏం సాధించారు అనే ప్రశ్నలు రావడం ఖాయం.
అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రుల హక్కును కాపాడటం కోసం మద్దతును ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తున్నారంట. ఎందుకంటే బీజేపీకి మెత్తగా చెబితే చెవికెక్కట్లేదు కాబట్టి.. మద్దతు ఉపసంహరించుకుంటే అప్పుడు బీజేపీ దిగొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారంట. ఇదే డిమాండ్ ఇప్పుడు కూటమిలో కూడా పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధిస్తే మాత్రం అది కచ్చితంగా చంద్రబాబుకు పెద్ద ప్లస్ అవుతుంది. మరి చంద్రబాబు మద్దతు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.