ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన దిశా నిర్దేశమే కనిపించని పరిస్థితి.
హరీష్ రావు సంగతేంటి.? ఆయన్ని చాలాకాలంగా గులాబీ పార్టీలో ఓ వర్గం దూరం పెడుతూ వస్తోంది. కానీ, ఆయన గులాబీ పార్టీనే అంటిపెట్టుకుని వున్నారు. ఎప్పుడైతే తెలంగాణ అన్న పేరు పార్టీ నుంచి మాయమైందో, అప్పటినుంచే గులాబీ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా మారిన గులాబీ పార్టీని ఎలా సంబోదించాలో కూడా కింది స్థాయి కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించి గద్దెనెక్కితే, గులాబీ పార్టీ అధికారం కోల్పోయినా, గౌరవ ప్రదమైన సీట్లే గెలుచుకుంది. ఇది అసెంబ్లీ లెక్క.
కానీ, లోక్ సభ ఎన్నికలకొచ్చేసరికి గులాబీ పార్టీ లెక్క గుండు సున్నా. అక్కడి నుంచి, గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళిపోవడం మొదలెట్టారు. ఇప్పటికే పది మందికి పైగా గులాబీ ప్రజా ప్రతినిథులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇంకో పది పదిహేను మందిని గనుక గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లాగేసుకోగలిగితే, తెలంగాణ రాష్ట్రంలో గులాబీ గుభాళింపులిక కనిపించవ్.! ఆ రోజెంతో దూరం లేదు.. అంటూ కాంగ్రెస్ నేతలు చాలా ధీమాగా చెబుతున్నారు.
విద్యార్థి ఉద్యమాల పేరుతో గులాబీ పార్టీ గలాటా చేస్తోంటే, గతంలోలా గులాబీ పార్టీని తెలంగాణ సమాజం హర్షించే పరిస్థితి కనిపించడంలేదు. ఆగస్ట్ – సెప్టెంబర్ నాటికి, మెజార్టీ గులాబీ ప్రజా ప్రతినిథులు కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోతారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.