ఏపీలోని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ఆ కంపెనీని లాభాల్లోకి తెస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉక్కు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని కేంద్రమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని లోకేష్ స్పష్టం చేశారు. సంపదను సృష్టించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని.. అలాంటిది సంపదను ఎలా అమ్ముతామంటూ ఆయన చెప్పారు. ఉక్కు కంపెనీని ఎలా లాభాల్లోకి తేవాలో తమకు తెలుసన్నారు. గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఉక్కు కంపెనీ నష్టపోయిందంటూ వివరించారు. ఒక కంపెనీని లాభాల్లో ఎలా నడిపించాలో జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు.
చాలా కంపెనీలు క్యాప్టివ్ మైన్స్ లేకుండానే నడుపుతున్నారని.. ఉక్కు కంపెనీని కూడా ఆ విధంగానే నడిపిస్తామన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే స్టీల్ కంపెనీకి నష్టాలు వచ్చాయని తెలిపారు. సరైన వ్యూహాలు ఉంటే నష్టాలు వచ్చి ఉండేవి కాదన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని.. అందులో విశాఖ స్టీల్ కార్మికులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. చాలా యూనివర్సిటీలను రాజకీయాల కోసం వాడుకున్నట్టు గుర్తు చేశారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో స్టూడెంట్ల జీవితాలను రాజకీయాల కోసం బలి చేయట్లేదని చెప్పారు. స్టూడెంట్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నట్టు వివరించారు మంత్రి లోకేష్.