‘నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం లీకైంది గనుక, ఆ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణని అరెస్ట్ చేశాం.. ఆయన కాకుండా ఇంకెవరైనా ఆ సంస్థకు బాధ్యులైతే వాళ్ళనే అరెస్టు చేస్తాం.. అక్రమాలు జరిగాయా.? లేదా.? అన్నది కోర్టు తేల్చుతుంది. దర్యాప్తు సంస్థల పని, నిందితుల్ని అరెస్టు చేసి కోర్టు ముందుంచడమే..’ అని సెలవిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ ఆయన్ని సకల శాఖా మంత్రి.. అని పిలుస్తారనుకోండి.. అది వేరే వ్యవహారం.
ఇంతకీ, ప్రభుత్వ స్కూళ్ళలో లీకైన పదో తరగతి ప్రశ్నా పత్రాల వ్యవహారంలో ఎవర్ని అరెస్టు చేయాలట.? ‘విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణనూ అరెస్ట్ చేయాల్సిందే..’ అంటోంది టీడీపీ. అయితే, అదెలా కుదురుతుంది.? అంటూ తనదైన స్టయిల్లో మీడియా మీద అసహనం వ్యక్తం చేశారు సజ్జల. ప్రభుత్వ స్కూళ్ళలో అక్రమాలు జరిగితే, సంబంధిత శాఖ మంత్రికేంటి సంబంధం.? అని సజ్జల తేల్చి చెప్పేశారు.
సో, అమరావతిలో చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగితే, అప్పటి మంత్రుల్ని అరెస్టు చేయకూడదన్నమాట. లేదంటే, మంత్రి పదవిలో వున్నప్పుడు అరెస్టు చేయకూడదుగానీ, మాజీలైతే అరెస్టు చేయొచ్చన్నమాట. ఇదేం లాజిక్ మహాప్రభో.? ఇంత అడ్డగోలుగా మాట్లాడతారు గనుకనే, ఏదన్నా కీలక వ్యవహారం రాష్ట్రంలో చోటు చేసుకుంటే, వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చేస్తారు.
నిజానికి, అరెస్టు అనేది పోలీస్ శాఖకు సంబంధించిన వ్యవహారం. ఆ అంశంపై మాట్లాడాల్సింది హోంమంత్రి లేదా.. పోలీస్ ఉన్నతాధికారులు. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చేసి, అక్రమాలు జరిగిపోయాయని తేల్చేస్తే.. ఇక దర్యాప్తు ఎందుకు.? అరెస్టులెందుకు.? నేరుగా శిక్షలు వేసెయ్యొచ్చు కదా.?
నారాయణ కావొచ్చు, శ్రీచైతన్య కావొచ్చు.. ఇంకో ప్రైవేటు విద్యా సంస్థల ఛెయిన్ కావొచ్చు.. వీటిల్లో అక్రమాలు కొత్తేమీ కాదు. ఏళ్ళుగా వీటిల్లో అక్రమాలు జరుగుతూనే వున్నాయి. ప్రతిసారీ ఇలాంటి కేసులు తెరపైకి రావడం, ఆ తర్వాత అంతా సర్దుకుపోవడం
సర్వసాధారణమైపోయింది. నారాయణ విద్యా సంస్థల్ని మూసేస్తామని ప్రభుత్వం చెప్పగలదా.? ఆ సంస్థల ఛెయిన్ నుంచి నారాయణను లేదా నారాయణ కుటుంబ సభ్యుల్ని తప్పింగచలమని ప్రభుత్వం చెప్పగలదా.? ఛాన్సే లేదు.. అంత ధైర్యం ప్రభుత్వానికి లేదు.