భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం చంపుకునే స్థితికి వెళ్లిపోతుండడం దారుణం. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో హేమంత బాఘ్ (35), సరిత (30) భార్య భర్తలు, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
అయితే కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తోన్న సమయంలో అన్నంలో చీమలు ఎందుకు వచ్చాయని భార్యను ప్రశ్నించాడు హేమంత్. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది.
కోపంతో ఊగిపోయిన సరిత అక్కడే ఉన్న స్కార్ఫ్ తో భర్త గొంతు నులిమి చంపేసింది. క్షణికావేశంలో జరిగినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు హేమంత్. హేమంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.