ఈ జనరేషన్ లో పెళ్లి అయితే తమ స్వేచ్ఛను కోల్పోతామని.. ఫ్రెండ్స్ తో బయటకు భార్య వెళ్లనివ్వదనే బెంగ చాలా మంది మగాళ్లలో ఉంది. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటున్నారనుకోండి. తమ భర్తలను వాళ్ల ఫ్రెండ్స్ తో కలవనివ్వకుండా కండీషన్లు పెట్టడంతో పాటు.. బయటకు పార్టీలకు, ట్రిప్పులకు వెళ్లనివ్వకుండా రూల్స్ పెడుతుంటారు. ఈ నడుమ భర్తలను ఇలాంటి టెన్షన్ ఎక్కువగా భయపెడుతోంది. అయితే తాజాగా ఓ నవ వధువు మాత్రం తాను ఇలాంటి కండీషన్లు ఏమీ పెట్టబోనంటూ హామీ ఇచ్చింది.
అంతే కాకుండా ఏకంగా స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ప్రమాణం చేసింది. ఈ ఘటన మైలాడుదురై జిల్లా సీర్డాళి సమీప తెన్ పాడిలో చోటుచేసుకుంది. తెన్ పాడికి చెందిన ముత్తుకుమార్ కు.. కురుంజిపాడుకు చెందిన పవిత్రతో సోమవారం వివాహం జరిగింది. అయితే ఆ పెళ్లికి వచ్చిన వరుడి ఫ్రెండ్స్.. ఇక మీదట తమ స్నేహితుడు తమతో బయటకు రాడేమో అని బాధపడ్డారు. దాంతో ఓ వంద రూపాయల స్టాంప్ పేపర్ ను తీసుకొచ్చారు. దాని మీద తమ స్నేహితుడిని బయటకు రానిస్తానని.. తమతో కలవనిస్తానని అంగీకరిస్తున్నట్టు అతని భార్య పేరు మీద అగ్రిమెంట్ రాశారు.
దానిపై సంతకం పెట్టమని కోరడంతో.. వధువు కూడా ఏ మాత్రం వద్దని చెప్పకుండా సంతోషంగా సంతకం పెట్టింది. దాంతో అక్కడకు వచ్చిన వారంతా.. వరుడు చాలా లక్కీ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సదరు వరుడిని అందరూ లక్కీ ఫెలో అంటూ కామెంట్లు పెడుతున్నారు.