ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్ పేరుని తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసేశారు వైఎస్ షర్మిల.
వైఎస్సార్ జిల్లా పేరుని వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు.. ఎన్టీయార్ జిల్లాని ఎన్టీయార్ విజయవాడ జిల్లాగా మార్చాలి కదా.? అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల ప్రశ్నించేయడం గమనార్హం.
అసలంటూ కడప జిల్లా పేరుని కాంగ్రెస్ పార్టీనే కదా వైఎస్సార్ కడప జిల్లా.. అని మార్చింది.? దాన్ని వైఎస్సార్ జిల్లాగా వైసీపీ మార్చింది. ఎన్టీయార్ జిల్లా.. అని పేరు కూడా వైసీపీ హయాంలోనే మారింది.
ఇలా జిల్లాల పేర్లకు వ్యక్తుల పేర్లను.. అదీ, రాజకీయ కోణంలో పెట్టడమే అభ్యంతరకరం. వైఎస్సార్ కడప జిల్లా కాదు, కడప జిల్లా.. అని పెట్టాలంటూ కడపలో వ్యక్తమవుతున్న అభ్యంతరాల్ని చూస్తున్నాం.
ఆ సంగతి పక్కన పెడితే, అసలు వైఎస్సార్ ఎలా ప్రజల ఆస్తి అయ్యారన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైఎస్సార్.. అని షర్మిల చెబుతున్నారు. రాజశేఖర్ రెడ్డి కంటే ముందు, స్వర్గీయ ఎన్టీయార్ తెలుగునాట సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్ కంటే ముందు, చంద్రబాబు హయాంలోనూ తెలుగునాట సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఆ మాటకొస్తే, స్వాతంత్ర్యం సిద్ధించినప్పటినుంచీ, దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది అధికారంలో వున్న పార్టీలకు ఓ అలవాటుగా మారిపోయింది.
ఇక, వైఎస్సార్.. రాష్ట్ర ప్రజల ఆస్తి.. అనే విషయానికొస్తే, ఆ లెక్కన వైఎస్సార్ ఆస్తుల్ని, పంచాల్సింది రాష్ట్ర ప్రజలకే కదా.? వైఎస్ జగన్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ మాత్రమే వైఎస్సార్ ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ, పంపకాల యుద్ధం చేస్తూ, కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్లు.?
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది వ్యవహారం.!