వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి, లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారారనే గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.
అక్కడి నుంచే, లిక్కర్ స్కామ్ కొత్త మలుపు తిరిగిందని అనుకోవచ్చేమో.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు ఈ కేసులో తాజాగా అరెస్టయ్యారు. అందులో ఒకరు ధనుంజయరెడ్డి కాగా, ఇంకొకరు కృష్ణమోహన్ రెడ్డి. ఈ ఇద్దరి మంచితనం గురించి వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వల్లెవేస్తున్న నీతులు అన్నీ ఇన్నీ కావు. ‘ఎంత మంచోళ్ళో తెలుసా.? అంత మంచోళ్ళను అరెస్టు చేయడం అక్రమం, దుర్మార్గం, దారుణం..’ అంటూ వైసీపీ నేతలంతా వరస పెట్టి మీడియా ముందుకొస్తున్నారు.
వల్లభనేని వంశీ చాలాకాలంగా జైల్లో వున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన వల్లభనేని వంశీ విషయంలోనూ ఇంత హడావిడి వైసీపీ చేయకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే, చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఆ లెక్కన, చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ అరెస్టు జరిగి తీరాలి. కానీ, పదకొండు నెలలు గడిచినా, వైఎస్ జగన్ అరెస్టు దిశగా సీఎం చంద్రబాబు ఎలాంటి కీలకమైన ముందడుగూ వేయలేదు.
ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు అంటే, వైఎస్ జగన్ అరెస్టుతో సమానం.. అన్నంతగా వైసీపీ శ్రేణులు హడావిడి చేస్తుండడం, వైసీపీలోనే కొందరికి షాక్ ఇస్తోంది.
లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి గతంలో వైసీపీ మీద వచ్చిన ఆరోపణలు, ఈ క్రమంలో ‘క్యూఆర్ కోడ్’ అంటూ వచ్చిన విమర్శలు.. అందరికీ గుర్తుండే వుంటాయి. ఈ కోణంలో చూస్తే, వైసీపీలో పెద్ద తలకాయ్ త్వరలోనే అరెస్టు కావడం ఖాయమని అనుకోవచ్చు. కానీ, ఆ పెద్ద తలకాయ్ వైఎస్ జగన్ కాకపోతే ఇంకెవరు.?
‘జగన్ అరెస్ట్ సాధారణ విషయమే అవుతుంది.. కానీ, జరగబోయే అరెస్ట్ అంతకు మించి..’ అంటూ వైసీపీ శ్రేణుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే, ఆ ‘వికెట్’ ఎవరిది.? కొద్ది రోజులు ఆగితే ఈ విషయమై స్పష్టత రావొచ్చు.
