ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి వైఎస్సార్ కడప జిల్లా అనే పేరు వచ్చింది. దాంట్లోంచి ‘కడప’ తీసేసి, పూర్తిగా వైఎస్సార్ జిల్లా.. అని మార్చేసింది గత వైసీపీ సర్కార్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా కడపకి, వైఎస్సార్ కడప జిల్లా.. అని అప్పటి ప్రభుత్వం నామకరణం చేసింది.
అయితే, కడప అనే పేరుకి ఓ ప్రత్యేకత వుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రత్యేకత అది. ‘దేవుని గడప’ అని పిలుస్తారు కడప జిల్లాని. అది కాలక్రమంలో ‘కడప’గా మారిందని చరిత్రకారులు చెబుతారు. హిందూ మత విశ్వాసాలతో ముడిపడి వున్న పేరు అది.
దేవుని గడపకి వైఎస్సార్ కడప.. అని పేరు పెడితే, ఎంత హేయంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా ‘కడప’ అనే పేరు తీసేసినా ఫర్లేదేమోగానీ, ‘వైఎస్సార్ కడప’ అని మళ్ళీ పేరు పెడితే అస్సలు తట్టుకోలేకపోతున్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు.
వైసీపీ హయాంలో వున్న ‘వైఎస్సార్ జిల్లా’ అనే పేరే కాస్త బెటర్, ‘వైఎస్సార్ కడప’ అస్సలు బాగాలేదని వెంకటేశ్వరస్వామి భక్తులు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతున్నారు.
మరి, ఈ పేరు వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, వీలైనంత త్వరగా ‘వైఎస్సార్ కడప జిల్లా’ అనే పేరుని కూటమి ప్రభుత్వం పునఃపరిశీలించడమే బెటరేమో.! కడప జిల్లాలోని ఏదన్నా ప్రభుత్వ నిర్మాణానికి వైఎస్సార్ పేరు పెట్టి, ‘కడప జిల్లా’ అనే పూర్వపు పేరునే కొనసాగిస్తే, వెంకటేశ్వర స్వామి భక్తులు శాంతిస్తారు. లేదంటే, పరిస్థితి అదుపు తప్పే అవకాశం లేకపోలేదు.