ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు, ప్రతిపక్ష హోదా ఆశిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అసెంబ్లీ వైపు అస్సలు చూడకుండా, అసెంబ్లీ చుట్టూనే తిరుగుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎక్కడో లేదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్‌కి కూతవేటు దూరంలోనే వుంది. పైగా, పెళ్ళిళ్ళకీ.. చావులకీ కూడా వెళ్ళి వస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఓ వైపు పెళ్ళిళ్ళలో వధూవరులకు ఆశీర్వచనాలు, చావు ఇళ్ళకు వెళ్ళి పరామర్శ యాత్రలూ చేసేస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే.
పెళ్ళిళ్ళకు వెళ్ళడం తప్పు కాదు.. చావు ఇంటికి వెళ్ళి పరామర్శించడమూ తప్పు కాదు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అది ఓ బాధ్యత కదా.? ఆ బాధ్యతనే విస్మరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే.
అనారోగ్య కారణాలు సాకుగా చూపితే అదో లెక్క.! దిట్టంగానే వున్నారు కదా.. అసెంబ్లీ చుట్టు పక్కలే.. అంటే, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే కదా.. శుభకార్యాల్లో పాల్గొనడం, అశుభకార్యాల నేపథ్యంలో పరామర్శల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నది.?
కూటమి పార్టీలు ప్రశ్నించడం ఓ లెక్క.. రాష్ట్ర ప్రజానీకం ఛీ కొడుతుండడం ఇంకో లెక్క.! పులివెందుల ప్రజానీకం సైతం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమర్థించే పరిస్థితి లేదు. ‘మా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరిస్తావని కదా, అసెంబ్లీకి నిన్ను పంపింది.. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకెందుకు ఎమ్మెల్యే పదవి.?’ అని పులివెందుల ప్రజలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా నిలదీసే రోజులు ముందు ముందు వున్నాయ్.
అసెంబ్లీకి వెళితే, పాత పాపాలు బయటపడతాయ్.! పైగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఫేస్ చేయాలి. అంతే కాదు, డిప్యూటీ స్పీకర్ ఛెయిర్‌లో వుండే రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి ‘అధ్యక్షా’ అనాలి.. అలా అనడానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అహం అడ్డొస్తుందాయె.! అయినాగానీ, ఇదా పద్ధతి.?
కొన్ని రోజులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై, అధికార పక్షం తనకు మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వకపోతే, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళకపోతే, అది మళ్ళీ వేరే చర్చ.
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని శాసన సభ్యుల శాసన సభ సభ్యత్వం రద్దు చేసేలా నిబంధనల్లో ఏమైనా మార్పులైనా చేసి, తగు చర్యల్ని సత్వరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీసుకుంటే మంచిది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో ఇంకెవరైనా పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి వుంటే, అసెంబ్లీకి వెళ్ళి.. పులివెందుల ప్రజలెదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి, ఆ సమస్యలకు పరిష్కారం వెతికేవారే.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం విషయంలోనే కాదు, వైసీపీ గెలిచిన మిగతా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి ఆయా ప్రజా ప్రతినిథుల మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అందరి మీదా, ఒకేసారి అనర్హత వేటు పడే అవకాశముందా.?