టీడీపీ అధినేత చంద్రబాబుకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గానే వుంది.! ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. సరైన వ్యూహంతో కలిసి కట్టుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మధ్యలో కొందరు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మాత్రం బెంబేలెత్తుతున్నారు. అదీ సోషల్ మీడియా కార్యకర్తలు.! అందునా, తెలుగు తమ్ముళ్ళ ఆందోళన ఎందుకన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది.
కొన్ని మేల్ అకౌంట్స్, కొన్ని ఫిమేల్ అకౌంట్స్.. సోషల్ మీడియా వేదికగా ఉలిక్కిపడుతున్నాయి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదన్నా విషయమ్మీద గట్టిగా మాట్లాడిన ప్రతిసారీ.!
సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న అలజడి రేగినా, అది రెండు పార్టీల మధ్యా గ్యాప్ పెంచేస్తుందేమోనన్న ఆందోళన సహజంగానే వ్యక్తమవుతుంటుంది. ఈ సోషల్ మీడియా హ్యాండిళ్ళకి, టీడీపీ అను‘కుల’ మీడియాకి చెందిన కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్ళు కూడా వంత పాడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చెందిన న్యూస్ ఛానళ్ళు, పత్రికలు (టీడీపీ అను‘కుల’) కూడా ఇదే కలవరపాటుకు గురవుతున్నాయి.
ఎందుకిలా.? పవన్ కళ్యాణ్ గనుక రాజకీయ నాయకుడిగా మరింత బలపడితే, నారా లోకేష్ రాజకీయ భవితవ్యానికి ఏమైనా కష్టం వస్తుందని సోకాల్డ్ తెలుగు తమ్ముళ్ళు కంగారు పడుతున్నారా.? అయినా, లోకేష్‌కి లేని ఇబ్బంది, వీళ్ళకెందుకు.?
గతంలోనూ ఇంతే.! ఈ సోకాల్డ్ తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ అను‘కుల’ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా వల్లనే, 2019 ఎన్నికల్లో టీడీపీకి అత్యంత దారుణమైన పరాజయం వచ్చిపడింది. దాన్నుంచి కోలుకోవడానికి టీడీపీ నానా కష్టాలూ పడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
అందుకే, టీడీపీ అధినేత చంద్రబాబు, గతంలోలా కాకుండా, ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అది సోకాల్డ్ అను‘కుల’ మీడియాకి అస్సలు మింగుడుపడ్డంలేదు. మొన్న మహిళల భద్రత విషయంలో కావొచ్చు, ఇప్పుడు అక్రమంగా దేశం దాటుతున్న రేషన్ బియ్యం విషయంలో కావొచ్చు.. జనసేనాని స్పందన, కూటమికి బలానిచ్చేవే. కానీ, సోకాల్డ్ తెలుగు తమ్ముళ్ళు ఉలిక్కిపడటం.. పరోక్షంగా టీడీపీ కొంప ముంచేలా వుంది.